Wednesday, December 25, 2024

ACB | రూ.5లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ కలెక్టరేట్ ఉద్యోగులు

వికారాబాద్ : జిల్లా తాండూరు ఆర్డీవో కార్యాలయంలో రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ సిటీ యూనిట్-1 అధికారులు సోమవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం.. దుద్యాల మండలం దుద్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సర్వే సంఖ్య 369లోని 6.26 గుంటల భూమిని ఎల్ఎఫ్ రోడ్డు నుంచి పట్టాభూమికి మార్చాలని కొద్ది రోజులు క్రితం పరిపాలన అధికారి దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావును కోరారు. ఇందుకు రూ. 5లక్షలు కావాలని డిమాండ్ చేశారు.

ఆ మేరకు అతను అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో అతను నిర్ణీత డబ్బును అధికారులకు అందజేయగానే ఏసీబీ వల వేసి పట్టుకుంది. కేసులో ఎ-1గా నమోదైన వై. దానయ్య నుంచి లంచం డబ్బు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. చేతి వేళ్లను రసాయన మందులతో కడిగిస్తే అనుకూల ఫలితం వచ్చింది. ఏ-2గా మాణిక్ రావును గుర్తించి ఇద్దరినీ అరెస్టు చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎస్పీఈ, ఏసీబీ న్యాయస్థానం స్పెషల్ జడ్జి ముందు వీరిని హాజరు పరుస్తామన్నారు. కేసు విచారణలో ఉందని అధికారులు తెలిపారు. డబ్బుతో పట్టు బడిన ఇద్దరు అధికారులను రాత్రి 11 గంటలు దాటినా ఆర్డీవో కార్యాలయంలో విచారించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement