జుక్కల్ (కామారెడ్డి) : జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి (14) బాన్సువాడలోని బోర్లం వద్ద గల మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. రెండు రోజులుగా ఆ విద్యార్థినికి తీవ్రమైన జ్వరం రావడంతో విద్యార్థినిని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిసింది. పరిస్థితి విషమించడంతో తల్లి చౌత్రబాయిని గురుకుల అధికారులు పిలిపించి అదే రోజు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కానీ మార్గమధ్యలోనే అంజలి మృతిచెందడంతో హుటాహుటిన ఇవాళ తెల్లవారుజామున స్వగ్రామమైన పడంపల్లికి శవాన్ని తరలించినట్టు గ్రామస్తులు తెలిపారు. విద్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థిని మృతిచెందడం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పడంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి శంకర్ చిన్నతనంలోనే మరణించడంతో ఇద్దరు కూతుళ్లకు తల్లినే ఆలానా పాలనా చూసుకుంటూ ఉండేది. అందులో ఒక కూతురు మృతిచెందడంతో తల్లి రోదనలు అందరినీ కలచివేశాయి.