Sunday, November 24, 2024

Singareni | గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు : సీఎండీ ఎన్.బలరామ్

గనుల్లో భద్రత పెంపునకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే చర్యలు తీసుకుంటామని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శుక్రవారం జరిగిన 48వ రక్షణ శాఖ త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు, మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్, సింగరేణి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

సింగరేణి సంస్థ… ఉత్పత్తిలోనూ ఆదర్శపాయంగా ఉండని…. రక్షణరంగంలోనూ ప్రమాద రహిత సంస్థగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి కార్మికుడి ప్రాణం ఎంతో విలువైనదని, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలని కోరారు.

నిర్లక్ష్యం, నిర్ల‌ప్త‌త‌ వల్లే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసురక్షిత వర్క్‌ప్లేస్‌లలో విధులు నిర్వహించమని మేనేజ్‌మెంట్ మిమ్మల్ని ఎప్పటికీ బలవంతం చేయద‌ని…. అదే సమయంలో, ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ ప్రధానమని గ్రహించాలని సూచించారు.

ఈ సమావేశంలో గనుల్లో భద్రత పెంచేందుకు…. నాణ్యమైన హెల్మెట్లు, షూల సరఫరా, వైద్యసేవలు పెంపు, క్యాంటీన్లలో మెరుగైన సౌకర్యాలు, కొత్త యంత్రాల కొనుగోలు, ఆధునీకరణ, అవసరమైన సిబ్బంది నియామకం తదితర అంశాలపై సింగరేణి కాలరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, ఇతర నాయకులు పలు సూచనలు చేశారు.

అనంతరం భద్రతా చర్యలపై సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ (ఈఅండ్‌ఎం), ఎన్‌వికె శ్రీనివాస్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ పర్సనల్‌), జి.వెంకటేశ్వరరెడ్డి (ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) మాట్లాడారు. సమావేశంలో ముందుగా ఇటీవల పలు ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు సంతాపం తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ జి. దేవేందర్, జిఎం. (CPP) జక్కం రమేష్ జీ. యమ్. (P&P) సాయిబాబా, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, అన్ని ప్రాంతాల నుండి గుర్తింపు, ప్రతినిధుల సంఘాల నాయకులు, DGMS అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement