హైదరాబాద్, ఆంధ్రప్రభ: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పియర్స్ స్థానంలో కొత్త పియర్స్ తోపాటుగా మూడు క్రెస్ట్ గేట్ల నిర్మాణంపై ప్రభుత్వందృష్టి సారించింది. కుంగిన 20,21,19 పియర్లను పూర్తిగా తొలగించి వాటిస్థానంలో నూతన పియర్లను నిర్మించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే కుంగిన పియర్ల స్థానంలో కొత్తవి నిర్మించాలంటే ప్రస్తుతం ఉన్న వీటిని పార్తి స్థాయిలో నిలవరించగలిగితేనే సాధ్యంగా భావించి కాఫర్ డ్యాం నిర్మాణం పనులను ఎల్ అండ్ టీ వేగవంతం చేసింది.
మరో వారం రోజుల్లోగా కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావస్తుండతో మిగతా పనుల ప్రణాళికను రాష్ట్ర నీటి పారుదల శాఖ సిద్ధంచేస్తోంది. అయితే కాఫర్ డ్యాం 400 చదరపు గజాల పొడుగు వెడల్పుతో కుంగిన పియర్లకు ముందు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే 5 పియర్ల దగ్గర నీటి నిలవరింపు జరుగుతోంది. అనంతరం కుంగిన పిల్లర్లతో పాటు మరో రెండు పిల్లర్ల దగ్గర భూసార పరీక్షలు నిర్వహించి నూతన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారు.
ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి 85 పియర్లు, 84 గేట్లు ఉండగా ఇందులో ఇందులో 20వ పియర్ మీటర్లు 25 సెంటిమీటర్లు కుంగి పోగా 19,21 పియర్లు ఒకమీటరు కుంగి పోయింది. అయితే ఈ పియర్లతో పాటుగా మూడు క్రెస్టర్ గేట్లు మీటరు వరకు క్రమేణ కుంగినట్లు నీటిపారుదల శాఖ నిపుణులు అంచనావేయడంతో పియర్లతో పాటుగా క్రెస్ట్ గేట్లను కూడా పునర్ నిర్మించాలని ఈఎన్సీ మురళీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు సమర్పించారు. అయితే ఈ రెండు పనులకు సుమారు రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వరకు అంచనావ్యయం కానున్నట్లు నీటిపారుదల అంచనావేసింది.
ప్రస్తుతం కాఫర్ డ్యాం, పిల్లర్ల పునర్ నిర్మాణానికి అంగీకరించిన ఎల్ అండ్ టీ క్లస్టర్ గేట్ల పునర్ నిర్మాణం పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాఫర్ డ్యామ్ పూర్తి అయిన అనంతరం ఇంజనీరింగ్ నిపుణులు కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణులతో కలిసి భూసార పరీక్షలు, ఇంజనీరింగ్ వైఫల్యాలపైశాస్త్రీయ అధ్యయనం చేయనున్నారు. అయితే పనుల్లో వేగం పెంచితేనే వేసవిలోగా మేడిగడ్డ పునర్ నిర్మాణం జరిగి రాబోయో వర్షకాలంలో నీటి నిల్వచేసే అవకాశాలున్నాయని ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నెలాఖరు లోగా డైమండ్ కట్టింగ్..
కుంగిన మేడిగడ్డ పియర్లను పునర్ నిర్మించని పక్షంలో ఏడవ బ్లాక్ లోని 10 పిల్లర్ల పై ప్రభావం పడే అవకాశాలున్నాయని ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొదట పియర్లను పూర్తి స్తాయిలో తెలగించి భూగర్భ పరిశోధనలు చేసిన అనంతరం పటిష్టమైన పునాదులపై తిరిగి పియర్లను, క్రెస్ట్ గేట్లను నిర్మించాల్సి ఉంది. పియర్ల నిర్మాణానికి సుమారు రూ. 600 కోట్లు అవసరం కాగా పిల్లర్లను డైమండ్ కట్టింగ్ ద్వారా కూల్చి వేసేందుకు మరో రూ.50 కోట్ల కు పైగా ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి.
అయితే బ్లాస్టింగ్ ద్వారా కూల్చితే మిగతా పియర్లతో పాటుగా గేట్లకు ప్రమాదం ఏర్పడే అవకాశాలుండటంతో డైమండ్ కట్టింగ్ కు నిపుణులు అంగీకరించారు. డైమండ్ కట్టింగ్ కు జర్మనీ, చైనా కంపెనీలు పోటీపడగా దేశంలోని హిల్తి ఇండియా ప్రైవేటు కంపనీ లిమిటెడ్ కంపెనీకి నీటిపారుదల శాఖ పనులు అప్పగించింది. 25 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పియర్ల పై మొదటి భారీ యంత్రాలను ఏర్పాటుచేసి చక్రాకారంలోని డైమండ్ కట్టింగ్ బ్లేడ్ తో మీటర్లు వైశల్యాం తో ముక్కలు ముక్కలుగా కట్టింగ్ చేస్తారు. ఈ కట్టింగ్ కు సుమారు 50 మంది నిపుణులు, భారీ యంత్రాలు, సుమారు 15 రోజుల సమయం పట్టనున్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు అంచనావేశారు. నిర్ధిష్ట సమయంలో పనులు పూర్తి అయి నిర్మాణాలు జరిగితే ఫిబ్రవరి నాటికి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ జరగనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు.