తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూడాలు నిరసనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. సోమవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు చేపట్టారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం తెలిపింది. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కరించేదాకా తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. దాదాపు 4 వేల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు సమాచారం. స్టైఫండ్ చెల్లింపులతో పాటు మరో 8 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా వైద్యశాఖ మంత్రి, ప్రభుత్వం పట్టించుకోలేదని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగినట్లు తెలిపారు. .
కొత్త ప్రభుత్వం కూడా తమ గోడు పట్టించుకోవడం లేదని జూడాలు మండిపడ్డారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా రోగులకు ఇబ్బంది కలగకూడదనే తిరిగి విధుల్లో చేరామని, అయినా సర్కారులో స్పందన లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో విధులు బహిష్కరిస్తునట్టు ప్రకటించారు.
గాంధీలో నిలిచిన ఓపి సేవలు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అత్యవసర సేవలు మినహా ఒపీ,వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేశారు. గాంధీ ఆసుపత్రిలో బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్టైఫండ్ చెల్లించడం, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత, నీట్‌లో 15 శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం,ఆస్పత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగు పర్చడం, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మేను కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఉస్మానియాలో కొత్త భవనం కావాలంటూ డిమాండ్ :
సమ్మె నేపథ్యంలో కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాలు ఆందోళనకు దిగారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్నా, పాలకులు పట్టించుకోవడం లేదని జూడాలు ఆరోపించారు. ఉస్మానియా హాస్పిటల్‌లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదని వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. తరుచు వైద్యులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వం స్పందించలేదు :
వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో జూడాలు ఆందోళన దిగారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపేసి సమ్మెకు దిగారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలతో పాటు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో జూడాలు సమ్మెబాట పట్టారు. కళాశాలలో మౌలిక సదుపాయాలతో పాటు పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం ఇలాంటి ప్రధాన ఎనిమిది డిమాండ్లతో సమ్మె నోటీస్ అందించామని ప్రభుత్వం స్పందించకపోవడంతో ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళన బాట పట్టామని స్పష్టం చేశారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ఇవే..
= ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ జమచేసేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి.
= ఆస్పత్రుల్లో భద్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పోలీసులతో ప్రొటెక్షన్ కల్పించాలి.
= పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలి.
= కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అంతర్గత రోడ్లు వేయాలి.
= సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెండ్లకు ₹ 1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలి.
= ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి.
= హాస్టల్ భవనాలను నిర్మించకపోవటంతో పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలి.
= ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి.