భూపాలపల్లి (ప్రభన్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జయశంకర్ జిల్లా మహాదేవపూర్ కాళేశ్వరంలో నిర్వహిస్తున్న ప్రాణహిత పుష్కరాలను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాళేశ్వరంలో వివిధ జిల్లాల నుంచి ప్రాణహిత పుష్కరాల బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ భగవంతుని సేవలో భక్తులు, భక్తుల సేవలో పోలీసులు అనే విధంగా సేవలందించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని, పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పి ఆదేశించారు.
ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పుష్కర ఘాట్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రాణహిత పుష్కరాల భద్రత జిల్లా పరిధిలో మొత్తం 12 సెక్టార్లుగా నిర్వహించడం జరిగిందని, వివిధ జిల్లాలకు చెందిన 660 మంది పోలీసులు బందోబస్తు పాల్గొంటున్నారని ఎస్పి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి బోనాల కిషన్ , డీఎస్పీలు నరసయ్య , గొర్రె మధు , వెంకటస్వామి , మహదేవపూర్, కాటారం సిఐలు కిరణ్ కుమార్, రంజిత్ రావు, వివిధ జిల్లాలకు చెందిన సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.