జన్నారం, (ఆంధ్రప్రభ) : అడవులను సంరక్షించడంలో అటవీ విభాగం, బీట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోనున్నట్టు కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్‌డిపిటి, సిఎఫ్ శాంతారాం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టీడీసీ ఆవరణలో మంచర్యాల జిల్లా జన్నారం ఫారెస్టు డివిజన్ పరిధిలోని అటవీశాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడవులను నరికివేసే కలప స్మగ్లర్లపై అటవీ కేసులతో పాటు పోలీసు కేసులు పెడుతున్నామని ఆయన చెప్పారు. వన్యప్రాణులను వేటాడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వన్యప్రాణి చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నామన్నారు.
అడవులు, వన్యప్రాణుల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీతాకోక చిలుకలు, పక్షుల సర్వే చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్, మంచిర్యాల జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజర్ రమాదేవి, తాళ్లపేట, జన్నారం, ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారులు సుష్మారావు, కె.శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, స్థానిక బీట్ అధికారి ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.