Saturday, November 16, 2024

Story – క‌ష్టాల్లో.. క‌ర్రిగూడ‌! డోలీ కడుతున్నా ద‌క్క‌ని ప్రాణాలు

కొండ కోన‌ల్లో ఆగిపోతున్న ఊపిరి
ర‌హ‌దారి మార్గం, వైద్యం సౌక‌ర్యం లేక నానా తిప్ప‌లు
ఆస్ప‌త్రికి వెళ్లాలంటే అట‌వీదారే దిక్కు
విజృంభించిన మాయ‌దారి అంటురోగాలు
ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన అధికారుల బృందం
కిలోమీట‌ర్ల దూరం న‌డ‌క‌తో ఓ అధికారికి తీవ్ర‌ అస్వ‌స్థ‌త‌
డోలీ క‌ట్టి హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించిన ఆదివాసీలు
స‌కాలంలో చేర్చ‌డంతో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డ ఎంపీడీవో
ర‌హ‌దారి, వైద్య స‌దుపాయాలు క‌ల్పించాలి
జిల్లా క‌లెక్ట‌ర్‌కు మొర‌పెట్టుకుంటున్న గ్రామీణులు
సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌ స్పందించాలి
మ‌రో ప్రాణం పోకుండా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి

ఆంధ్రప్రభ స్మార్ట్, అనంతగిరి (అల్లూరి జిల్లా) : అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలంలోని మారుమూల పంచాయతీ గుమ్మ కర్రిగుడ గిరిజనులు సరైన వైద్యం అందక, రహదారి సౌకర్యం లేక డోలి మోతలతో అల్లాడిపోతున్నారు. మీడియాలో వ‌చ్చిన కథనాలపై కలెక్టర్ చలించిపోయారు. తీవ్రంగా స్పందించారు. తక్షణమే మండల అధికార యంత్రాంగం అంతా కర్రిగూడ వెళ్లి.. పరిస్థితిని పరీక్షించి, పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అక్క‌డి ఎంపీడీవో ఏవీవీ కుమార్, త‌హసీల్దార్ మాణిక్యం, ఈవోపీఆర్డీ సీతయ్య, ఆర్ఐ శంకర్రావు, లంగపర్తి వైద్యాధికారిణి మంజు భార్గవి, సచివాలయ సిబ్బంది అంతా క‌లిసి కర్రిగూడకు వెళ్లారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచారు. ఆపసోపాలు పడుతూ కర్రిగూడకు చేరుకున్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. గిరిజనం కూడా అధికారుల చర్యలకు సంతోషం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు తెలిపారు. కానీ, ఇక్కడే పెద్ట ట్విస్ట్ ఎదుర‌య్యింది.

- Advertisement -

గిరిజ‌నుల సాయం.. ఆ ఎంపీడీవో సేఫ్‌

అక్క‌డికి వెళ్లిన అధికారులను ఈ ఘ‌ట‌న‌ కుదిపేసింది. ఎనిమిది కిలోమీటర్లు నడచి వచ్చిన అధికారుల్లో ఎంపీడీవో కుమార్ తీవ్ర‌ అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. ఆయాసాన్ని త‌ట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వ‌చ్చిన ఇత‌ర‌ ఆఫీసర్లు, సిబ్బందికి గుండె ఆగినంత పన‌య్యింది. వీరితోపాటు వైద్యాధికారి అందుబాటులో ఉండటంతో ఆయన బతికి బట్టకట్టగలిగారు. అక్కడే ఉన్న డాక్టర్ మంజూభార్గవి ఎంపీడీవో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. తక్షణమే వైద్య సాయం కోసం ఆస్ప‌త్రికి తరలించాలని చెప్పారు. తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడటానికి వచ్చిన అధికారే ప్రాణాపాయ స్థితికి చేరుకోవటంతో గిరిజనులు త‌ల్ల‌డిల్లారు. అప్ప‌టిక‌ప్పుడు డోలీ కట్టారు. హుటాహుటిన ఎంపీడీవోనూ సురక్షిత ప్రాంతానికి తరలించారు. 108 వాహనం ఎక్కించారు. ఆయనను ఆసుపత్రికి చేర్చారు. సకాలంలో వైద్య సాయం అందటంతో ఆ ఎంపీడీవో ఆరోగ్యం కుదుటపడింది. ఆయన కుటుంబం ఊపిరిపీల్చుకుంది.

ఆగ‌ని వాంతులు, విరోచ‌నాలు..

కర్రిగూడ గ్రామంలో కొన్ని రోజులుగా గిరిజనం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ స్థితిలో డోలిమోతతో ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కడం లేదు. గిరిజనం అవస్థలు, ఆవేదనను వెళ్లగక్కుతూ ఇటీవల మీడియా ప్రతినిధులు వార్తలు రాశారు. దీనిపై కలెక్టర్ స్పందించారు. ఆ గ్రామానికి అధికారుల బృందాన్ని పంపించారు. ఇక‌.. స్వ‌యంగా మండ‌లానికి చెందిన‌ ఓ ఉన్న‌తాధికారికి ఎదురైన ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి. డోలి మోత నుంచి విముక్తి ప్రసాదించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

త‌ల్ల‌డిల్లుతున్న ప‌ల్లె.. ఏటా మ‌ర‌ణాలే..

పూర్తిగా అడ‌విలోనే ఉండే ఈ ప‌ల్లెలో ఏటా మ‌ర‌ణాలు త‌ప్ప‌డం లేదు. ఏదైనా ఆప‌ద‌వ‌చ్చినా, క‌డుపునొచ్చినా, పురుగు కుట్టినా నాటు వైద్యమే దిక్క‌వుతోంది. కొన్నిసార్లు విక‌టించి అక్క‌డే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాపాయ స్థితిలో డోలీక‌ట్టి ఆస్ప‌త్రికి చేర్చే క్ర‌మంలో కూడా ప్రాణాలు పోయిన ఘ‌ట‌న‌లున్నాయి. ఈ ప‌దేండ్ల కాలంలో ఏటా ముగ్గురు, న‌లుగురు చ‌నిపోతున్న ప‌రిస్థితులున్నాయి. దీంతో క‌ర్రిగూడ గిరిజ‌నులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలోనే క‌ర్రిగూడ‌కు చెందిన సుక్రం (50) వాంతులు, విరోచ‌నాల‌తో బాధ‌ప‌డుతుంటే ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చ‌నిపోయింద‌ని ప‌ల్లె జ‌నం క‌న్నీరుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement