కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువుకు దూరం
ఆ మమకారం చంపుకోలేక మళ్లీ క్లాసులకు
సహకరించిన అత్తింటి వారు, కుటుంబ సభ్యులు
ఉన్నత చదువులకు ఆలంబనగా అంబేద్కర్ వర్సిటీ
కొడుకుతో పాటు చదువుకునే అవకాశం అదృష్టం
ఈ చాన్స్ అందరికీ రాదంటున్న స్వర్ణలత
పెళ్లి, కుటుంబ సమస్యలు ఇలా వివిధ కారణాలతో చదువును మధ్యలోనే వదిలేసినవారు చాలా మంది ఉన్నారు. అయితే.. చదుకోవాలనే ఆసక్తి., చదువు మీద ప్రేమ చాలామందిలో అలాగే ఉండిపోతుంది. కొంత మంది పెళ్లి అనంతరం, మలి వయసులోనూ పరీక్షలు రాసేవారి గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ, తల్లి కొడుకులు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకునే సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు.. అలాంటి అరుదైన సన్నివేశం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలో కనిపించింది. ఓ తల్లి కొడుకులు కలిసి ఒకే కోర్సులో చేరి ఒకే తరగతి గదిలో కలిసి కూర్చుని పాఠాలు వినే అత్యంత అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆ తల్లి కొడుకులు కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సు చేస్తున్నారు. ఈ అరుదైన ముచ్చట తెలుసుకోవాలంటే కమాన్‌పూర్ వెళ్లాల్సిందే.. అందాక ఎందుకు అనుకుంటే మ్యాటర్‌లోకి వెళ్లి చదివేద్దాం పదండి..
= ఆంధ్రప్రభ స్మార్ట్, కమాన్‌పూర్ – కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన జక్కుల అలియాస్ గాండ్ల స్వర్ణలత (38) .. తన కుమారుడు రోషన్ (18)తో కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరారు. ఇది ఒక సంవత్సరం కోర్సు కాగా, వీరు 2024 – 25 విద్యా సంవత్సరానికి ఇందులో చేరారు. ఇక.. గాండ్ల స్వర్ణలత వివాహనికి ముందు ఇంటర్మిడియేట్ పూర్తి చేసింది. వివాహం అనంతరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరం 2005 పూర్తి చేశారు. కొన్ని కారణాలతో ఐదు సంవత్సరాల కాల పరిమితి అనంతరం డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబందించిన విద్యను 2010-11, 2011-12 లలో పూర్తి చేశారు.
పెద్దపల్లి ఐటీఐలో…
ఆనంతరం 2014లో పీజీ (ఎమ్మెస్సీ మ్యాథ్స్) చేశారు. మళ్లీ చదువుకు బ్రేక్ పడింది. ఈ కాలవ్యవధిలో స్వశక్తి సంఘంలో సీఏగా బాధ్యతలు నిర్వహించారు. తన కుమారుడు పెద్దపల్లి ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఆమె కూడా చదువుపై ఉన్న మక్కువతో అదే కోర్సుకు దరఖాస్తు చేసింది. ఆ కోర్సులో కొడుకుతో పాటు తల్లి కూడా చేరింది. ఈ ఒక సంవత్సరం కోర్సులో విద్యనభ్యసించేందుకు పెద్దపల్లి ఐటీఐ కేంద్రానికి ప్రతి నిత్యం ఆ తల్లి కొడుకులు కలిసి వెళ్ళివస్తున్నారు.
వింతగా అనిపించినా.. హ్యాపీగా ఉంది..
తల్లి కొడుకులు కలిసి విద్యాభ్యాసానికి వెళ్లిరావడం మొదట్లో ఇటు గ్రామస్తులను… అటు అదే కోర్సులోని తోటి విద్యార్థులనూ వింతగా అనిపించింది.. కాస్త విస్మయపరిచింది. తన పిల్లల వయస్సున్న వారితో కలిసి కోర్స్ చేయడం గర్వాంగా ఉందని ఆమె చెబుతున్నారు. తల్లితో కలిసి కోర్సు చేయడం చాలా అరుదుగా కొడుకులకు లభించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా బావిస్తున్నానని కుమారుడు రోషన్ చెబుతున్నారు. ప్రతి నిత్యం తమ కోర్సులో చెప్పిన అభ్యాసం గురించి తల్లి కొడుకులు చర్చించుకుంటారని వారిద్దరూ చెబుతున్నారు. ఒకే కోర్సును తాము ఇద్దరం కలిసి చదువుకోవడం మాటల్లో చెప్పలేని ఓ మధురనుభూతిని కలిగించిందని ఆ తల్లి కొడుకులు చెబుతున్నారు.
=================
తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే..
నేను మా ఇంట్లో మూడో సంతానంగా జన్మించాను. నాకు ముందు ఇద్దరు సోదరులున్నారు. ఆడపిల్లనేనే చిన్న చూపు చూడకుండా మా తల్లిదండ్రులు జక్కుల చంద్రమ్మ – మల్లయ్య మంచిగా చదివించి వివాహం చేశారు. అనంతరం భర్త లక్ష్మణ్ కూలి పని చేస్తూ కూడా చదువుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అందువల్లనే ఉన్నత చదువులు అభ్యశించడంతో పాటు ప్రస్తుతం మా కుమారుడితో కలిసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్స్ చేస్తున్నాను. ఇదంతా కుటుంబ సభ్యుల సహకారంతోనే సాధ్యమైంది.
= జక్కుల అలియాస్ గాండ్ల స్వర్ణలత
అమ్మతో కలిసి చదవడం నా అదృష్టం
మా అమ్మ స్వర్ణలత ఉన్నత చదువు అభ్యసించింది. నాకు చిన్ననాటి నుండి విద్యా బుద్దులు నేర్పింది. అమ్మతో కలిసి చదువుకునే అరుదైన అవకాశం నాకు దక్కడం నా జన్మలో మరిచిపోలేని మధురనుభూతిగా నిలిచిపోతుంది. నాకు ఎల్లవేళలా నా విద్యాభ్యాసంలో సందేహాలు నివృత్తి చేస్తూ.. నా ఉన్నత చదువులకు అండగా ఉంటున్న మా అమ్మ నాన్నల ప్రోత్సాహంతో నేను అనుకున్న గమ్యానికి చేరుకోగలననే ధీమాతో ఉన్నాను..
= గాండ్ల రోషన్