హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, శాసన సభాధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డే బరిలోకి దిగుతారని భారత రాష్ట్ర సమితి(భారాస) అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ దఫా ఎన్నికల్లో పోచారం బదులు ఆయన కుమారుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పోటీ కి దిగుతారని, ఈ మేరకు భారాస అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని జరుగుతున్న ప్రచారానికి , కథనాలకు తెరదించిన కేసీఆర్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎమ్మెల్యేగా పోచారం ఉంటారని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతోంది. ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ మళ్ళీ అవకాశం ఉంటుందని సాక్షాత్తు కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రకటించారు. ఎమ్మెల్యేల పనితీరును మార్చుకోవాలని, ప్రజలకు చేరువై వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై స్పందించాలని దిశానిర్దేశం చేశారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానాల్లో కొత్తవారిని ఎన్నికల బరిలో నిలుపుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాను చేయిస్తున్న సర్వేలలో భారాస 90 నుంచి 110 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన చెప్పిన విషయం విదితమే. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెల్యేలు తమ పిల్లలను బరిలో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా పార్టీలో, బయట ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం జరుగుతున్న జాబితాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు నెంబర్ వన్‌గా ఉంది. శాసనమండలి అధ్యక్షుడు నల్గొండ లోక్‌సభకు గతంలో ప్రాతినిధ్యం వహించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన తనయుడిని నల్గొండ ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న పట్టు దలతో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే తరహాలో అసెంబ్లీకి ఐదారు దఫాలు ఎన్నికై అరవై ఏళ్ళు పైబడిన నేతలంతా తాము రాజకీయాల నుంచి తప్పుకుని కుటుంబ సభ్యలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. మరి పార్టీ అధినేత కేసీఆర్ వీరి ప్రతిపాదనను ఆమోదిస్తారా లేక స్పీకర్ పోచారం తరహాలోనే మళ్ళీ ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆదేశాన్ని ఇస్తారా అన్నది తేలాల్సి ఉందని పార్టీ నేతలంటు న్నారు.