తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందని చెప్పారు.
తెలంగాణ భవన్ నుంచి ‘ఛలో నల్లగొండ’ బహిరంగ సభకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్లగొం జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని చెప్పారు. అసెంబ్లీలో అబద్ధాలను ప్రచారం చేసిందని విమర్శించారు. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడం మంచిది కాదని, దానివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
బస్సులలో బయలుదేరిన కేటీఆర్ ,హరీష్ లు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభలో సహచర సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితర ప్రముఖులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి “చలో నల్లగొండ సభ”కు బస్సులో బయలుదేరి వెళ్లారు.