Tuesday, November 26, 2024

TS: ఢిల్లీ యాత్రలు మాని.. పంట పొలాలకు రండి.. కేటీఆర్

రైతు ప్రభుత్వమని ప్రగల్బాలు పలికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు మాని రైతులు నష్టపోయిన పంట పొలాలు పరిశీలించాలని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… ఇప్పటికే 14సార్లు ఢిల్లీ యాత్రకు వెళ్లిన రేవంత్ రెడ్డికి రైతులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించే సమయం లేకపోవడం దారుణమన్నారు. ఎన్నో దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచిందన్నారు. రైతంగానికి సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్రంలో 15లక్షల ఎకరాల వంట నష్టం జరిగిందన్నారు.

నైతిక బాధ్యత వహిస్తూ అన్నం పెట్టే రైతాంగానికి ఎకరానికి 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన 2లక్షల రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా లీగల్ నోటీసులు రైతాంగానికి పంపించి వారిని గోస పెడుతున్నారన్నారు. ప్రస్తుతం నెలకొన్న కరువు కాలం తెచ్చింది కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద మూడు పిల్లర్లు పొంగిపోతే కాలేశ్వరం ప్రాజెక్టుపై కడుపు మంటతో మరమ్మత్తులు చేయకపోవడం వల్ల లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందన్నారు. కాపర్ డ్యాం నిర్మించి నీటిని పంపింగ్ చేయాల్సింది పోయి, అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో 200మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా ద్వారా ఎకరానికి 15వేల రూపాయలు అందించాలన్నారు. రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement