Friday, November 22, 2024

ADB: మట్కాపై ఉక్కు పాదం – ఎస్పీ గౌస్ అలం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా ఇక ఉక్కు పాదం మోపనున్నట్టు అదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం తెలిపారు. మట్కా నేరస్థులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేలా యోచిస్తున్నట్టు తెలిపారు. శనివారం ఆదిలాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ…. యువత ఆన్లైన్ గేమ్ లకు, మట్కాకు బానిస కాకుండా ఉండాలనీ, జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దన్నారు. మట్కా జూదం ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి మట్కా చిట్టీ లు, రూ. 32,750ల‌ నగదు స్వాధీనం చేసుకొని జైనథ్ భీంపూర్ లలో 11మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
యువత, జిల్లా ప్రజలు మట్కాపై ఆకర్షితులు కాకుండా జిల్లా వ్యాప్తంగా మట్కా నిర్మూలనే లక్ష్యంగా పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈసందర్భంగా బీంపూర్, జైనథ్ పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసుల వివరాలను వెల్లడిస్తూ… ఈ సంవత్సరం 12 కేసుల్లో 41 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి దాదాపు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నందున బార్డర్ కి అవతల వైపు ఉన్న నేరస్తులు జిల్లాలో తరచూ మట్కా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం 43 మట్కా కేసులను నమోదు చేసి 116 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.6,54,660ల‌ నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మట్కా తో సంబంధం ఉన్న తలమడుగు మండలంకు చెందిన సత్యనారాయణ, హెచ్ కిషన్, ఆదిలాబాద్ కు చెందిన సయ్యద్ రజియుద్దీన్ ల‌రె అరెస్ట్ చేశామని తెలిపారు. అశోక్ సామ్రాట్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ లక్కాడి జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఎస్ఐలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement