Sunday, November 17, 2024

విష జ్వరాల కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వే.. ఇంటింటికీ వెళుతున్న వైద్య బృందాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటా జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో విష జ్వరాల కట్టడికి ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతోంది. కరోనా విజృంభించిన సమయంలో ఇంటింటి సర్వే నిర్వహించి వైరస్‌ను అదుపు చేసినట్లే… ప్రస్తుతం విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వేను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమాన్ని పకడ్బంధీగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో విషజ్వరాలు మరింత ప్రబలకుండా జిల్లా వైద్యాధికారులను మంత్రి హరీష్‌రావు అప్రమత్తం చేశారు. విష జ్వరాల నియంత్రణకు వివిధ శాఖల సిబ్బందితో వైద్య ఆరోగ్యశాఖ సమన్వయం చేసుకుంటోంది. సిబ్బందిని ప్రత్యేక బృందాలు విభజించి ఇంటింటికీ పంపిస్తూ జ్వర సర్వేను నిర్వహిస్తున్నారు. జ్వరం లక్షణాలున్న వారిని, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తుస్తున్నారు. వీరితోపాటు దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్‌ ఉన్న రోగులను కూడా గుర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 15 రోజులుగా నిరంతరాయంగా జ్వర సర్వే కొనసాగుతోంది. నివాస పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు వృద్ది చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్న జ్వర సర్వే బృందాలు నీటి తొట్టెలు, పాడైపోయిన సామాగ్రిలో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలను హై రిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు సిఫారసు చేస్తున్నారు. ఇంటింటి సర్వేలో ఆరోగ్యశాఖ సిబ్బంది పెద్ద ఎత్తున రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇంటి వద్దకే మందుల కిట్లు…

రాష్ట్ర వ్యాప్తంగా వారంలో రెండు రోజులు డ్రై డే కొనసాగుతోంది. ఇంటి పరిసరాలు, కాలనీల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా డ్రైడే రోజుల్లో చర్యలు చేపడుతున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి అక్కడికక్కడే మందుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. జ్వర పీడితుల ఇంటి వద్దకే వెళ్లి మరీ వైద్య, ఆరోగ్యశాఖ మందుల కిట్లను అందిస్తోంది. కిట్లలో ఉన్న మందులను ఎలా వాడాలో సిబ్బంది వివరిస్తున్నారు.

బీపీ, షుగర్‌ పేషెంట్లకు ప్రత్యేకంగా మందుల కిట్లు…

మధుమేహం, రక్తపోటు, అధిక రక్తపోటుతో బాధపుడుతున్న వారికి మందులతో కూడిన కిట్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. చదువురాని వారికి సైతం ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళ్లలో ఏ మందులు ఎలా వేసుకోవాలో ప్రజలకు అర్తమయ్యే రీతిలో కిట్లను రూపిందించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement