నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల జాగీర్ కాదని… తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. అక్టోబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశమవుతుందన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… కవులకు, కళాకారులకు. విద్యావంతులకు.. మేధావులకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ.. కేసీఆర్ కుటుంబానికి కొమ్ముకాస్తున్న వాళ్లు.. వారికి సేవ చేసే వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనన్నారు. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదన్నారు. రాష్ట్రంలో అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటనీ విమర్శించారు. 17సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందన్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగర ఇంచార్జ్ ధనపాల్ సూర్య నారాయణ, దినేష్ కులాచారీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎండల లక్ష్మి నారాయణ, ప్రేమేందర్ రెడ్డి, పెద్దొళ్ల గంగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన ధన్పాల్..
నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కంటేశ్వర్ లోని బైపాస్ రోడ్ చౌరస్తా బీజేపీ నేత ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అర్బన్ నియోజకవర్గం కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కారు ర్యాలీతో బయలుదేరి పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధన్ పాల్ పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అదే కాన్వాయ్ తో జి జి కాలేజ్ లో జరగబోయే నరేంద్ర మోడీ సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు.