Monday, November 18, 2024

సెప్టెంబర్ 2 నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం… మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : నగరంలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సెప్టెంబర్ 2వ తేదీ నుండి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్ లు అనుదీప్ దురిశెట్టి, హరీష్, అమయ్ కుమార్, హౌసింగ్ సీఈ సురేష్ లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సెప్టెంబర్ 2వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని 8ప్రాంతాల్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్ లను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత ఉండేందుకు గాను ఈనెల 24వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి డ్రా పద్దతిలో అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. మొదటి విడతగా 12 వేలమంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయించనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చి తన ఉదారత్వాన్ని చాటుకున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, డ్రైనేజీ, వాటర్, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement