జన్నారం, (ప్రభ న్యూస్) : విద్యుత్ సబ్ స్టేషనులో నిలిచిన వర్షపు నీరుతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ సబ్ స్టేషన్ ఉద్యోగి కట్టెకోల రాజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
కాగా, విద్యుత్ శాఖ ఏఈఈ లచ్చన్న, సబ్ ఇంజినీర్ నాగూరి అజయ్ కుమార్, ఇతర ఉద్యోగులు అక్కడే ఉండి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం ఎఈఈ లచ్చన్న మాట్లాడుతూ…. భారీ వర్షానికి సబ్ స్టేషన్ ఆవరణలోకి, కార్యాలయ భవనంలోకి నీరు చేరడంతో పట్టణంలో అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిందన్నారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ వర్షపు నీరు మోకాళ్ల వరకు నిలిచిపోతుందన్నారు.