నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్యామ్‌లోకి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్‌కు 52,340 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు జలాశయం 16 గేట్లు ఎత్తి 49,920 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 7,500 క్యూసెక్కులు నీరు గోదావరిలోకి వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం నీటిమట్టం 1090.9 అడుగులుగా ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 89.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. దర్పల్లి, భీంగల్, తిరుకొండ ప్రాంతాల్లో మొదలయ్యే వాగు అన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిండి రోడ్లపై పారుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో పెరిగిన బిర్యానీ ధరలు!