Tuesday, November 26, 2024

TS : ఇవాళ్టి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

ఇవాళ్టి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

- Advertisement -

ఉదయం అంతరాలయంలోని ధ్రువమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారోహణం చేయనున్నారు. వేడుకల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, స్నపన తిరుమంజనం, వాస్తు హోమం, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం దర్బార్‌ సేవ తర్వాత నూతన పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే కల్పవృక్ష వాహనంపై తాత గుడి సెంటర్‌ వరకు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం, 17వ తేదీన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుకల కోసం కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఈవో వెల్లడించారు. ప్రతి భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందేలా ఈసారి 60 తలంబ్రాల కౌంటర్లు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేసేందుకు 19 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం 2.50 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశామని ఈవో రమాదేవి పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో కూడా స్వామివారి తలంబ్రాలను భక్తులకు అందజేస్తామని, ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా కూడా భక్తులకు తలంబ్రాలను ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఈ నెల 17 ఉదయం 6 గంటల వరకు ఒరిజినల్‌ టికెట్లను అందజేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement