Friday, November 22, 2024

TS: రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతోంది.. సత్యవతి రాథోడ్

ప్రభ న్యూస్, ప్రతినిధి, భూపాలపల్లి: ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రక్కన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర జ్యోతి వెంకట రమణా రెడ్డి సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు శుక్రవారం వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు ఎన్ వి మోహన రంగాచార్యుల పండిత బృంద వేద మంత్రోశ్చరణల నడుమ స్వామి వారికి ప్రాణప్రతిష్ట చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రణాళికా బద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రూ.1,200 కోట్లతో పునర్నిర్మించారనీ, వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధికి రూ.70 కోట్లు ఖర్చు చేశారన్నారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500కోట్లు ప్రకటించారని తెలిపారు. రూ.50 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, రూ.100కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, రూ.25 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు సీఎం కేసీఆర్ పునర్జీవం పోశారనీ కొనియాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,645 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయగా, కొత్తగా 2,796 దేవాలయాలను చేర్చారన్నారు. ఈ పథకం ద్వారా అర్చకుల వేతనాలను 6వేల నుంచి 10 వేలకు పెంచుకున్నామన్నారు. హిందువులు అని చెప్పుకునే వారు, వారు చేసే పనులకు సంబంధం లేదన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నడుస్తున్నారు కాబట్టే ఈరోజు ఇంత ఖర్చుపెట్టి గొప్ప ఆలయాన్ని నిర్మించారన్నారు. సర్వాంగ సుందరంగా వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారని ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్ట‌ర్ కే.వాసుదేవ రెడ్డి, ఇతర అధికారులు, ప్రతినిధులు, నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement