వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : పోలీసులు దాడులు చేస్తూ గుట్కా వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్న, అక్రమార్జనకు అలవాటు పడ్డ కేటుగాళ్ళు సరి కొత్త ఎత్తులు వేస్తూ గుట్కా దందాను గుట్టుగా సాగిస్తున్నే ఉన్నారు. పోలీసులు వేసే నిఘాకు చిక్కకుండ పకడ్బందీగా గుట్కాను దిగుమతి చేసుకోవడమే కాకుండా, అందరి కళ్లుగప్పి ప్రభుత్వ నిషేధిత గుట్కా చీకటి వ్యాపారాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మూడు నెలల పాటు రెక్కీ వేసి ఎట్టకేలకు ఇద్దరు గుట్కా వ్యాపారులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.సంతోష్ నేతృత్వంలో ఆకస్మిక దాడి చేసి 3 లక్షల 37 వేల 6 వందల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకొన్నారు.
గత కొంత కాలంగా గుట్కా, పొగాకు ఉత్పత్తులను మహబూబాబాద్ కు చెందిన వ్యాపారి ద్వారా మహబూబాబాద్ నుండి బై వరంగల్ కు పొగాకు ఉత్పత్తులు దిగుమతి చేసుకొంటూ, ఎవ్వరి కంట పడకుండా గుట్కా నగరాల్లోని పాన్ షాప్స్, కిరాణం దుకాణాలకు సరఫరా చేస్తున్న అక్రమ దందా నిర్వహకుడు పూర్ణచందర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. బీదర్, హైదరాబాద్ నుండి దిగుమతి చేసుకుని చీకటి దందా చేస్తే, పోలీసులకు చిక్కడం ఖాయమని భావించి, ఎవ్వరికీ అనుమానం రాకుండా మహబూబాబాద్ నుండి సరుకును దిగుమతి చేసుకుని పక్కాగా, పక్కడ్బంధీగా పాన్ షాప్స్ కు కిరాణం దుకాణాలకు విక్రయిస్తున్నాడు.
శనివారం పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గవిచర్లరోడ్డులో ఇంటిని రెంట్ కు తీసుకొని గుట్కా, పొగాకు ఉత్పత్తులను ఓ సిటీకి చెందిన పూర్ణచందర్ నిల్వ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. శనివారం మహబూబాబాద్ నుండి గుట్కా, పొగాకు ఉత్పత్తులు దిగుమతి చేసుకొంటున్న సమయంలో దాడి చేసి, గుట్కా చీకటి దందాను వెలుగులోకి తెచ్చారు పోలీసు.
నిషేధిత గుట్కా విక్రయాలు,అమ్మకాలు సాగిస్తున్న పూర్ణచందర్ పాటు, మహబూబాబాద్ కు చెందిన లెక్కలపెల్లి శ్రీనివాస్ (52) లను అరెస్ట్ చేశారు. 138 ప్యాకెట్ల కాశ్మీర్ కిమామ్, 116 రాజా రత్న, 5 బాబా 160, 422 ప్యాకెట్ల కింగ్ జర్ధా, 5 ప్యాకెట్ల బ్లాక్ జర్ధా, 720 ప్యాకెట్ల వి ఐ పి జర్ధా, 64 ప్యాకెట్ల ఎన్ పి ప్రీమియం జర్ధా, 6 ప్యాకెట్ల అంబర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily