హైదరాబాద్, ఆంధ్రప్రభ: పంద్రాగస్టు రోజున రాయితీ కల్పించిన టీ24 టిక్కెట్టును జంటనగర ప్రయాణికులు భారీగా వినియోగించుకున్నారు. దీనికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.120 ఉన్న టీ24 టిక్కెట్టు ధరను ఆగస్టు 15న రూ.75కు తగ్గించడంతో హైదరాబాద్ నగరంలోని ప్రయాణికులు అత్యధికంగా వినియోగించుకున్నారు. సాధారణ రోజుల్లో 11 వేలకు మించని టి24 టిక్కెట్ల అమ్మకాలు సోమవారం రోజు మూడు రెట్లు అంటే 33వేలకు పెరిగాయి. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ విసి.సజ్జనార్ మాట్లాడుతూ టీ24 టిక్కెట్టును ఆగస్టు 15న తగ్గించడంతో హైదరాబాద్ రీజియన్లో 17,204, సికింద్రాబాద్ రీజియన్లో 15,829.. మొత్తం 33,033 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని తెలిపారు. టీ24 టిక్కెట్టు ద్వారా ఆ రోజు సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఉందని, ఈ టిక్కెట్టును కొనుగోలు చేసి సిటీ బస్సుల్లో తిరగడం ద్వారా ప్రయాణికులు ఖర్చు ఆదా అవుతుందని వారు తెలిపారు.
ఈ సందర్భంగా వినియోగువారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే జేబీఎస్లో సామూహిక జాతీయ గీతాలాపనలో సంస్థ ఎండి సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం రిజర్వేషన్, బస్పాస్ కౌంటర్లను సందర్శించారు. ప్రయాణికులకు మెరుగైనా సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. పికెట్, కంటోన్మెంట్ డిపోలను సైతం సందర్శించి ఉత్తమ ఉద్యోగులను ప్రశంసించారు. డిపో స్థాయిలోని అధికారులు, సిబ్బంది సంస్థ రాబడిని పెంచే దిశలో ప్రయత్నాలు ఉండాలని కోరారు.