Sunday, November 10, 2024

Special Story – వెదురు గుర్రాల ఖోడంగ్!

ఇదీ ఆదివాసీల సంబురం
అనాదిగా వ‌స్తున్న ఆచారం
సంప్ర‌దాయాల‌కే ప్రాధాన్యం
పల్లెల్లో రేలా రేలా ఆట‌పాట‌లు
ఊరు ఊరంతా సంబురాలు
సంప్ర‌దాయ‌ల‌ను మ‌ర‌చిపోని గిరిపుత్రులు
శ్రావణంలో వెదురు గుర్రాల‌కు ప్ర‌త్యేక‌త‌
ప్ర‌భావం చూప‌ని పాశ్చాత్య పోక‌డ‌లు
అడ‌విత‌ల్లి కాపాడుతంద‌నే న‌మ్మ‌కం

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్: ఆదివాసీలు అనాదిగా పాటించే ఆచార‌, సంప్ర‌దాయాల‌ను మ‌రిచిపోలేదు. ఎన్ని పాశ్చాత్య రీతులు వ‌చ్చినా వారి సంప్ర‌దాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెల్‌ఫోన్ స్మార్ట్‌గా మారినా.. ఇంటింటికీ టీవీలు వ‌చ్చినా.. పాశ్చాత్య పోక‌డ‌లు వారిపై ఎలాంటి ప్ర‌భావం చూప‌డం లేదనే దానికి ఖోడంగ్ ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఒక వైపు ఆధునిక నాగ‌రిక ప్ర‌పంచం వైపు ప‌రుగులు తీస్తూ.. పాశ్చాత్య ప్ర‌భావం లేకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతూ వ‌స్తున్నారు. సంప్రదాయంగా సాగే రేలా రేలా ఆటపాటల‌తో గూడేం ప్ర‌జ‌లంతా ఆనందంగా గ‌డుపుతున్నారు.

ప్ర‌కృతియే ఆరాధ్య దైవం

అడవి తల్లి ఒడిలో జీవనం సాగించే గోండు, కొలాo, ప్రధాన్, తోటి, ఆంధ్ తెగ ఆదివాసీలు ప్ర‌కృతియే ఆరాధ్య దైవంగా భావిస్తారు. అందుకే ప్ర‌కృతి ప్ర‌సాదించిన చెట్ల‌కు పూజ‌లు చేస్తారు. శ్రావణమాసంలో వచ్చే ఖోడంగ్‌ పండగ గిరిజన గూడెల్లో సందడి తెచ్చిపెడుతోంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ జిల్లాలలోని మారుమూల గూడ‌ల్లో నిర్వ‌హించే ఈ పండ‌గ‌కు విశిష్ట‌త కూడా ఉంది. ఉట్నూర్ ఏజెన్సీలోని జైనూరు, సిర్పూర్, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లో వెదురు గుర్రాల ఖోడoగ్ పండగ నిర్వ‌హిస్తున్నారు.

- Advertisement -

పండ‌గ నిర్వ‌హించేదిలా…

గిరిజన గ్రామాల్లో కుల పెద్దలు జామా రాముస్ సూచ‌న మేర‌కు పండ‌గ‌లు జ‌రుపుకుంటారు. జ్యేష్ఠ అమావాస్య అనంత‌రం శ్రావ‌ణం వ‌స్తుంది. ఆషాఢం ప్రారంభ‌మ‌య్యే వ‌ర‌కూ ఈ పండ‌గ నిర్వ‌హిస్తుంటారు. దీన్నే ఖోడoగ్‌గా వ్యవహరిస్తారు. అడవుల నుంచి పొడవైన వెదురు బొంగులను తీసుకువచ్చి వెదురు కర్ర మధ్యన పాదాలు ఇమిడే విధంగా మేకులు బిగించి, న‌డిచేందుకు అనువుగా తయారు చేస్తారు. వీటిని వెదురు గుర్రాలు అని పిలుస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా తమ గిరిజన గూడెంలో వీటిపై సరదాగా నడుస్తూ సందడి చేస్తారు. వెదురు గుర్రాలతో గంట నుండి రెండు గంటల పాటు నడిచి ఆనందం పొందుతారు. అమావాస్య రోజున వెదురు గుర్రాలకు (బొంగులు) ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అడవి తల్లి తమను సుభిక్షంగా కాపాడాలని వేడుకుంటారు. మరుస‌టి రోజు ఉదయాన్నే ఆదివాసులు ఆనవాయితీగా జాగేయ్ మాతరి పండగ నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement