పులుల సంరక్షణ గాలికివదిలేసిన అటవీశాఖ
ఆక్రమణలు పెరిగినా పట్టించుకోలేదు
బఫర్ జోన్లో భవంతులు.. పెట్రోల్ బంకులు
అటవీశాఖ అధికారుల్లో అంతులేని నిర్లక్ష్యం
ప్రస్తుతం నలుగురు అధికారుల సస్పెన్షన్
విధుల్లో నిర్లక్ష్యం.. మరో ఇద్దరిపై చర్యలకు సిద్ధం
కఠిన చర్యలుంటాయన్న ఉన్నతాధికారులు
తప్పిపోయిన ఆడపులి.. గర్భంతో ఉన్నట్టు గుర్తింపు
రక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని దారిగాం శివారులో రెండు పులులు మృతి చెందిన ఘటన అటవీశాఖలో కల్లోలం రేపుతూనే ఉంది. అటవీశాఖ ఉన్నతాధికారులు పులుల మృతి ఘటన అనంతరం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. వరుసగా రెండు పులుల మృతితో కాగజ్నగర్ ఎఫ్‌డీవో టి.వేణుబాబు, పెంచికల్ పెట్ ఎఫ్ఆర్ఓ ఎస్. వేణుగోపాల్ , డిప్యూటీ రేంజ్ అధికారి పోశెట్టి, బీట్ ఆఫీసర్ శ్రీకాంత్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనలో విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాగజ్నగర్ మరో డిప్యూటీ రేంజ్ అటవీ మహిళా అధికారి, సర్కేపల్లి శివారులోని మరో అటవీ అధికారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
అధికారుల నిర్లక్ష్యం.. ఆక్రమణలకు కారణం
టైగర్ రిజర్వ్ జోన్లో వరుసగా పెద్ద పులుల మరణానికి అటవీ డివిజన్ అధికారుల అంతులేని నిర్లక్ష్యంతో పాటు అక్రమంగా అడవుల్లోకి చొరబడి భవంతుల నిర్మాణం, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం కారణంగా తెలుస్తోంది. పులుల కారిడార్ దారులు మూసుకుపోవడం తదితర ఉదంతాలు ప్రత్యక్షంగా చూసిన ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం సర్కిల్ ఫారెస్ట్ అధికారి శాంతారామ్ పులుల మరణంపై నివేదిక పీసీసీఎస్ కు అందించారు. కాగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయితే.. అన్నిటికంటే ముఖ్యంగా పెంచికల్ పేట్ అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా నిబంధనలు తోసిరాజి పెట్రోల్ బంక్ నిర్మాణం జరగడం, ఇదే రేంజ్ లోని కొండపల్లి, లోడుపల్లి, దహేగాం మండలంలోని గేర్రె , గిగడ అటవీ శాఖ పరిధిలో ఆక్రమణలతోపాటు భవంతుల నిర్మాణం జరుగుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది.
పదేండ్లుగా ఆ అధికారి ఇక్కడే..
పది సంవత్సరాలుగా పెంచికల్పేట్ రేంజ్ లో అతుక్కుపోయిన రేంజ్ అధికారి వేణుగోపాల్ కాగజ్నగర్ లో అదనపు విధులు నిర్వర్తిస్తూ పలు ఆరోపణలు మూటగట్టుకున్నట్టు తెలుస్తోంది. పులుల సంరక్షణపై కలప స్మగ్లింగ్ పై ఈ డివిజన్లో అంతులేని నిర్లక్ష్యం కూడా ఎన్ సి టి ఏ అధికారుల్లో అసంతృప్తికి దారితీసింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు పిసిసిఎఫ్ అధికారులకు సూచించినట్టు సమాచారం. కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధి 9,745 హెక్టార్ల విస్తీర్ణం ఉండాల్సి ఉండగా ఆక్రమణలు పెరిగిపోయి కాంక్రీట్ జంగల్ గా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ పెట్రోల్ బంకులు అటవీ శాఖ పరిధిలో లేవని ఈ ప్రదేశంలో ఎలా నిర్మించారని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తు న్నట్టు సమాచారం.
గర్భంతో ఉన్న ఆడపులి..
కాగజ్‌నగర్‌కు అటు ఇటు డివిజన్లో 12 పులులు ఉండగా వాటి సంరక్షణకు కారిడార్ లో ప్రత్యేక చర్యలకు అధికారులు సమయతమవుతున్నారు. విష ప్రయోగం నుండి తప్పించుకున్న ఆడపులి గర్భం దాల్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఒక కాన్పులో నాలుగు పిల్లలు జన్మిస్తాయని ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని, పులుల కదలికలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సస్పెండ్ అయిన ఎఫ్డిఓ స్థానంలో మంచిర్యాల జిల్లాకు చెందిన రెగ్యులర్ అధికారిని రెండు రోజుల్లో నియమించనున్నారు. తాత్కాలికంగా ఆసిఫాబాద్ డిఎఫ్ఓ కేబ్రియాల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్ద పులుల మరణం అటవీ శాఖలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా అలజడి రేపుతోంది..