Monday, November 18, 2024

Special Story – రాఖీల మురిపెం! పెద్దప‌ల్లి టూ ఫారిన్‌

తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకూ సప్లయ్​
పెద్దపల్లి రాఖీల‌కు పెద్ద ఎత్తున ఆర్డర్లు ​
చూడముచ్చటైన డిజైన్లు
43 వేల ర‌కాల్లో త‌యారీ
ధరలు కూడా అందుబాటులోనే
12 రాష్ట్రాలు.. నాలుగు దేశాల‌కు స‌ర‌ఫ‌రా
ఏటా రెండు వేల మందికి ఉపాధి
అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి మన రాఖీలే నిదర్శనం

ఆంధ్రప్రభ, పెద్దపల్లి: ర‌క్షాబంధ‌న్‌.. అన్నాచెల్లెళ్లు.. అక్కాత‌మ్ముళ్లు.. సంబురంగా జ‌రుపుకునే పండ‌గ‌. ఆత్మీయ‌త అనురాగాల‌ను ప్రస్పుటం చేసేందుకు చిహ్నం రాఖీ. ఎవ‌రి స్థాయి బ‌ట్టీ వారు రాఖీలు కొనుగోలు చేస్తారు. ర‌క‌ర‌కాల రాఖీలు కొన‌డానికి ఆడ పిల్ల‌లు ఆస‌క్తి చూపుతారు. అయితే.. ఎంతో చూడముచ్చటైన రాఖీలు తెలంగాణ‌లోని పెద్ద‌ప‌ల్లిలో త‌యారు చేస్తున్నారంటే నమ్మరేమో. అవును.. ఇక్క‌డ త‌యారయ్యే రాఖీల‌కు పెద్ద ఎత్తున డిమాండ్​ ఉంది. త‌క్కువ ధ‌ర‌, అనేక ర‌కాల రాఖీలు ఉండడంతో ఆర్డర్లమీద ఆర్డర్లు వస్తునాయి. అందుకే.. ఇక్క‌డి నుంచి విదేశాలకు కూడా రాఖీలను ఎగుమతి చేస్తున్నారు.

ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు..

- Advertisement -

ర‌క్షాబంధ‌న్ వ‌చ్చిందంటే రాఖీల‌కు గిరాకీ పెరుగుతుంది. ప‌దేళ్ల క్రితం వ‌ర‌కూ కోల్​క‌తా, రాజ‌స్థాన్ నుంచి రాఖీలు దిగుమతి అయ్యేవి. అక్కడి డీలర్లు ఎంత ధర చెప్తే.. అంతకు కొనాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్ర‌స్తుతం మన దగ్గరే రాఖీలు తయారు చేస్తుండడంతో ధరల కోసం డిమాండ్​ చేయాల్సిన పరిస్థితి లేదు. అతి త‌క్కువ ధ‌ర‌కే పెద్ద‌ప‌ల్లిలోని త‌యార‌వుతున్న అనేక ర‌కాల‌ రాఖీలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

దేశ‌విదేశాల్లో పెద్ద‌ప‌ల్లి రాఖీల విక్ర‌యం

ఏపీ, తెలంగాణలో రాఖీలు త‌యారు చేసే ఏకైక కేంద్రం పెద్ద‌ప‌ల్లి కావడంతో డిమాండ్​ కూడా అదే స్థాయిలో ఉంది. తొమ్మిదేళ్ల కింద‌ట‌ పెద్దపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ రాఖీ త‌యారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. అనేక డిజైన్ల‌లో త‌యారీ చేసి విక్ర‌యిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రాఖీలు ఇక్క‌డ మాత్ర‌మే త‌యారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచి రెండు రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అలాగే ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌, ప‌శ్చిమ‌ బెంగాల్‌ రాష్ట్రాలతోపాటు అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు పెద్దపల్లిలో తయారైన రాఖీలు సరఫరా అవుతున్నాయి. లండన్‌లోని ఎస్‌.మార్ట్‌లో ఎస్‌ఆర్‌ఆర్‌ రాఖీలను విక్ర‌యిస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌ నుంచి పెద్ద‌ప‌ల్లికి రాఖీల కోసం వ్యాపారులు వ‌స్తుంటారు.

ప‌ది పైస‌ల నుంచి…

ఇక్కడ త‌యారు అవుతున్న రాఖీలు ప‌ది పైసల నుంచి ₹400 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. సుమారు 43 వేల రకాల రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. బార్‌ కోడింగ్‌ పద్ధతిలో బిల్లింగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని దుకాణాల్లో విక్రయించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున అక్కడి వ్యాపారులు పెద్దపల్లి రాఖీలను కొనుగోలు చేశారు. గతంలో ₹10కి దొరికే రాఖీలు ప్రస్తుతం ₹2కే దొరుకుతున్నాయి.

2000 మందికి ఉపాధి

పెద్ద‌ప‌ల్లి కేంద్రంగా త‌యార‌వుతున్న రాఖీల వ‌ల్ల సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో మహిళ రోజుకు ₹300 నుండి ₹750 వరకు సంపాదిస్తున్నారు. ఒక చిన్న ప‌రిశ్ర‌మ‌లా రాఖీల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు.

ధర తగ్గింది.. ఉపాధి పెరిగింది

పెద్ద‌ప‌ల్లిలో రాఖీ తయారీ కేంద్రం నెలకొల్పడంతో గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. ఎస్‌ఆర్‌ఆర్‌ సీజన్‌ సెంటర్‌లో హోల్‌సెల్‌, రిటైల్‌లో రాఖీలు విక్రయిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకులు తీసుకువచ్చి రాఖీలు తయారు చేయడంతో ఈ ప్రాంతంలోని మూడు వేల మందికిపైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలలపాటు ఇట్లా ఉపాధి అవకాశాలు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహిళలకు రాఖీల తయారీపై ఉచిత శిక్షణ ఇప్పిస్తాం. గతంలో కలకత్తా నుంచి తెచ్చి రాఖీలను విక్రయించే వాళ్లం. ఇప్పుడు 12 రాష్ట్రాలకు సరఫరా చేస్తుండడం సంతోషంగా ఉంది. రాబోయే ఏడాది దేశంలోని 29 రాష్ట్రాలకు రాఖీలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.

  • ఇల్లందుల కృష్ణమూర్తి, ఎస్‌ఆర్‌ఆర్‌ రాఖీ సెంటర్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement