Monday, November 25, 2024

Special story : కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో దోబూచులాట‌… నేత‌ల్లో పెరుగుతున్న టెన్ష‌న్

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు అతి త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా కూడా మోగించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటివరకు బోధన్ సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ వినయ్ రెడ్డి, బాల్కొండ సునీల్ రెడ్డి పేర్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గత ఆరు స్థానాలకు అధిష్టానం ఎటూ తేల్చుకోలేక కొత్త అభ్యర్థుల కోసం నేటికీ వెతుకులాట ధోరణి కొనసాగిస్తుంది. నిజామాబాద్ అర్బన్ స్థానానికి ధర్మపురి సంజయ్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టికెట్ పొందేందుకు వారి ప్రయత్నాలు వారు చేసి ఇప్పటికే విఫలమైనట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత రెండు రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు. అర్బన్ స్థానాన్ని ఆకుల లలితకు కట్టబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూరల్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోరాటం చేసేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నప్పటికీ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా రంగంలోకి దింపి నిజామాబాద్ అర్బన్ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎల్లారెడ్డి, బాన్సువాడ టికెట్ల కేటాయింపు దోబూచులాట.
కామారెడ్డి జిల్లాలో నాలుగు శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయింది. ఎన్నికలు ముంచుకొస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు తీవ్ర పోటీ పడుతున్నారు. అధిష్టానం సైతం ఎటూ తేల్చుకోలేక గెలుపు గుర్రాల్ని రంగంలోకి దింపాలని, టికెట్లు దక్కని వారు ఇతర పార్టీలోకి వెళ్లకుండా వారందరినీ బుజ్జగించి టికెట్ల కేటాయింపు చేయాలన్న ఆశయంతో అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్ర పోటీ ఉంది. గత ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమిపాలైన మదన్మోహన్ ఎల్లారెడ్డి నుండి పోటీ చేయాలని నాలుగేళ్లుగా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటూ ప్రజాసేవలను చేస్తూ ప్రజల ఆదరణ పొందారనే చెప్పవచ్చు.

ఎల్లారెడ్డి నుండి సుభాష్యన్ రెడ్డి గత పదివేల నుండి నియోజకవర్గ ప్రజలతో దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకి ఇవ్వాలని గత ఎన్నికల్లోనూ అధిష్టానాన్ని కోరారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాజాల సురేంద్రకు టికెట్ కేటాయించి సుభాష్ రెడ్డిని బుజ్జగించి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. ఆనాటి పరిస్థితుల్లో మార్పులు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన జాజాల సురేందర్ కాంగ్రెస్ పార్టీకి చేయందించి కారు ఎక్కేశారు. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ఏనుగు రవీందర్ రెడ్డి ఆ పార్టీలో ఉండలేక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో కూడా ఉండడం ఇష్టంలేక ప్రస్తుతం తెలంగాణలో వీస్తున్న కాంగ్రెస్ గాలిని పసిగట్టి ఏనుగు రవీందర్ రెడ్డి సైతం హస్తం గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చేరడమే కాకుండా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండి గెలుపొంది తీరుతానని ధీమా వ్యక్తం చేస్తూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి నుండి పోటీ చేసేందుకు ముగ్గురు బలమైన వ్యక్తులు పోటీ పడటంతో అధిష్టానం టికెట్ కేటాయింపుల్లో మల్లగుల్లాలు పడుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్న ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తిరిగి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గంను శాసిస్తున్న శీనన్న పోటీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కోసం తీవ్ర పోటీ పడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 16మంది తమకు టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక నాయకులు బాన్సువాడ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.

స్థానికేతర్లకు కేటాయిస్తే తాము సహాయ నిరాకరణ చేస్తామని స్థానికులకు టికెట్లు కేటాయిస్తే బాన్సువాడలో కాంగ్రెస్ జెండా ఎగర వేసి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రోజుకో ఆలోచన చేస్తూ అటు అభ్యర్థులకు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అయోమయానికి గురిచేస్తుంది. నిన్నటి వరకు ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నుండి పోటీ చేయాలని సముదాయించారు. మదన్మోహన్ ను బాన్సువాడ నుండి పోటీ చేయాలని అధిష్టానం పెద్దలు ఎందరో

తీవ్రవంతులు చేసినప్పటికీ మదన్ ససేమిరా అనడంతో అధిష్టానం టికెట్ల కేటాయింపు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎల్లారెడ్డి నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం తనకు అవకాశం కల్పించాలని తాను పోటీ చేస్తానని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే బలమైన అభ్యర్థులు ఉండడంతో వారిని పలు నియోజకవర్గాల్లో పోటీ చేయించి జిల్లాలోని నాలుగు స్థానాలను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలు చేస్తుంది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నందున కాంగ్రెస్ పార్టీ నేడు అభ్యర్థుల ప్రకటన చేసే ప్రక్రియలో మునిగితేలారు. ఎల్లారెడ్డి నుండి పోటీ చేస్తానంటున్న మదన్మోహన్ ను బాన్సువాడ నుండి పోటీ చేయాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మదన్మోహన్ కు కామారెడ్డిలో, ఎల్లారెడ్డిలో, బాన్సువాడలో మంచి పట్టు ఉండడాన్ని అధిష్టానం గమనిస్తూ మదన్మోహన్ ను ఎల్లారెడ్డి కాకుండా బాన్సువాడలో పోటీ చేయించి బాన్సువాడలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

- Advertisement -

మదన్మోహన్ కు టికెట్ కేటాయిస్తే స్థానిక నాయకులు, టికెట్ ఆశావాహులు సైతం రాజీపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి స్థానికేతరుడని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వారితో ఎవరితో సన్నిహిత సంబంధాలు లేకపోవడం ఏనుగును నిరాకరిస్తున్నారు. మదన్మోహన్ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి బాన్సువాడ నియోజకవర్గంలోనూ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోచారంపై విజయం సాధించాలంటే మదన్ మోహన్ లాంటి వ్యక్తితోనే సాధ్యమని కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. షబ్బీర్ అలీ విషయానికొస్తే షబ్బీర్ అలీ కామారెడ్డి స్థానం నుండి పోటీ చేస్తారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి సైతం మంచి పట్టు ఉంది. కేసీఆర్ పై కూడా పోటీ చేసి గెలిచి తీరుతానని షబ్బీర్ తన అనుచరులతో ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజాధరణను పొందుతున్నారు. జుక్కల్ స్థానానికి సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపులో ఆచి చూచి అడుగులు వేస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సౌధాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ అంటేనే జుక్కల్ లో గంగారం. నియోజకవర్గంలో ఒక బలమైన వర్గం కూడా గంగారం వెంటే ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు గంగారం ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ దీర్ఘ ఆలోచన చేస్తుంది. కొత్త అభ్యర్థిని రంగంలో దింపి జుక్కల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సమాలోచనలు చేస్తున్నారు. బాన్సువాడ నుండి మదన్మోహన్ ను, ఎల్లారెడ్డి స్థానం నుండి ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కథనరంగంలోకి దింపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement