మద్దతు కూడగట్టే యత్నంలో కాంగ్రెస్
మరో ఐదుగురు ఎమ్మెల్సీల సపోర్టు అవసరం
కాంగ్రెస్ పార్టీలోకి మొదలైన చేరికలు
సీఎం రేవంత్ గురి ఎవరిమీదనో మరి
తెలంగాణలో ఇదే చర్చనీయాంశం
తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వలలో ఇంకా ఎంతమంది ఎమ్మెల్సీలు పడతారో అనేది ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలోగా మరి కొందరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బాట పడతారని చర్చ జరుగుతుంది. శాసనమండలిలో ఏ ఒక్క బిల్లు తిరస్కరణ కాకూడదని సీఏం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించి సక్సెస్ అయ్యారన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అయితే బిల్లులు ఆమోదం పొందాలంటే సగం కంటే ఎక్కువ బలం ఉండాలి. ఆ మేరకు మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందన్నది ఒక చర్చ జరుగుతుంది.
మరో ఐదుగురు మద్దతు అవసరం
శాసనమండలిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి మరో ఐదుగురు వరకు అవసరం ఉంటుంది. మొత్తం 40 సభ్యులు ఉన్న శాసన మండలిలో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు. ఇందులో రెండు ఖాళీగా ఉన్నాయి. నలుగురు నామినెటెడ్ సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ ఇద్దరు, బీఆర్ ఎస్ ఇద్దరు ఉన్నారు. మిగిలిన 34 సభ్యులు ఎన్నికైన వారు. ఇందులో బీఆర్ఎస్ కు 26 మంది సభ్యులుండగా, కాంగ్రెస్ పార్టీ ఆరుగురున్నారు. రంగా రెడ్డి జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మేల్సీ గా గెలిచిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా అడపా దడపా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 12 కు చేరింది. మరో ఐదుగురు వరకు బలం కావాల్సి ఉంటోంది.
అంతుపట్టని చేరికలు
తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బలం పెంచుకోవడం కోసం వలసలను ప్రోత్సహించారని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా, అలాగే పార్టీ పరంగా బలం పెంచుకుంటే సీఎం పీఠం కదిలే పరిస్థతి ఉండదు. ఆమేరకు తన కార్యాచరణ అమలు చేస్తున్నారన్నదే చర్చ. జాతీయ పార్టీల నుంచి వలసలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల నుంచి అధికార పార్టీల వైపు వలసలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వలసలు అన్ని అలానే జరుగుతున్నాయి. ఊహకు అందని విధంగా చేరికలు జరగడం అంతుపట్టడం లేదని పలువురు రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు.