- అద్దె ప్రాతిపదికన కూడా బస్సులు
- తెలంగాణలో ఎనిమిది ప్రాంతాల నుంచి సర్వీసులు
- కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం
- పంచారామాలకు ప్రత్యేక ప్యాకెజీ బస్సులు
- టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళుతుంటారు. అలాగే తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వెళ్లనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజీ బస్సులు నడపడానికి, అద్దె ప్రాతిపదికన ఇవ్వడానికి టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ప్రత్యేక ప్యాకేజీ బస్సులు…
ఈనెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున అరుణాచలానికి చేరుకుంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ ప్రకటించింది. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించగలరని సూచించింది.
అద్దె ప్రాతిపదికన…
అద్దె ప్రాతిపదికన తీసుకునే ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా తగ్గించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు బస్సు కిలోమీటరుకు రూ.11, ఎక్స్ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8 , సూపర్ లగ్జరీకి రూ. 6, రాజధాని రూ.7 వరకు ధర తగ్గించారుని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ తెలిపారు. ఏపీలో పంచారామాల కోసం ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 30-40 మంది భక్తులు ఉంటే వారు కోరిన తేదీల్లో పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.