Friday, November 22, 2024

Special for mens: పురుషులకు స్పెష‌ల్ బ‌స్సులు వ‌చ్చేశాయ్…..

హైద‌రాబాద్ – ‘మహాలక్ష్మి పథకం’లో భాగంగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించిన త‌ర్వాత బ‌స్సుల‌లో మగవారికి సీట్లు లేకుండా పోయాయి. క‌నీసం ఎక్కేందుకు సైతం నానా పాట్లు ప‌డాల్సిన స్థితి..క‌ష్ట‌ప‌డి లోప‌లికి వెళ్లినా ఎంత దూరమైన నిలబడి ప్రయాణం చేయాల్సిన దుస్థితి.

అన్ని బ‌స్సులు మ‌హిళ‌ల‌తో కిట‌కిట‌లాడిపోతున్నాయి.. డ‌బ్బులు చెల్లించే పురుష ప్ర‌యాణీకులు త‌మ ప‌రిస్థితి ఏంటీ అని ఆర్టీసీ అధికారుల‌కు మొర పెట్టుకుంటున్నారు.దీనిపై అధికారులు స్పందించారు.. ఇప్పుడు పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ప్రారంభించినట్లు స‌మాచారం . ‘పురుషులు మాత్రమే’ అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. దీంతో మగవాళ్ళు మనకు కూడా స్వాతంత్య్రం వచ్చిందని ఎగిరి గంతేస్తున్నారు. హమ్మయ్య పురుషులకు కూడా సీట్లు దొరికి కూర్చునే రోజులు వచ్చేశాయంటూ.. లేచింది పురుష ప్రపంచం అంటూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం- ఎల్‌బీ నగర్‌ రూట్‌లో ఓ ఆర్టీసీ బస్సు ‘పురుషులకు మాత్రమే’ అనే బోర్డుతో కనిపించింది. గతంలో ఆర్టీసీ బస్సులు ‘మహిళలకు మాత్రమే’ అనే బోర్డు పెట్టేవి. ఇప్పుడు పురుషులు మాత్రమే అని చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని పురుషుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని వారు ఆనందంగా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. పురుషులకు కూడా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆర్టీసీ అధికారులు ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement