Tuesday, November 26, 2024

బొగ్గు రవాణా వేగవంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. బొగ్గు రవాణా చేసే గూడ్స్‌ రైళ్ల నిర్వహణను వేగవంతం చేసి.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు అవసరాలను నేరవేర్చాలని సూచించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో సరుకు రవాణా, లోడింగ్‌ రైళ్ల నిర్వహణలోని భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌కు చెందిన ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ బొగ్గును ఆలస్యం లేకుండా షెడ్యూల్‌ ప్రకారం లోడిరగ్‌ జరిగేందుకు సైడిరగ్‌ల వద్ద తరచూ తనిఖీలు నిర్వహిస్తూ పర్యవేక్షణ చేపట్టాలని సూపర్‌వైజర్లను ఆదేశించారు.

సరుకు రవాణా మార్గాలలో అడ్డంకులుంటే వాటిని గుర్తించి ఆయా సెక్షన్లలో రైళ్ల వేగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సరుకు రవాణా పురోగతికి కృషిచేస్తున్న అన్ని డివిజన్ల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత సరుకు రవాణా లోడిరగ్‌కు ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించి భద్రతా సిబ్బంది అందరితో పాటు లోకో పైలట్లకు మరియు అసిస్టెంట్‌ లోకో పైలట్లు ఇతరులకు క్షేత్రస్థాయిలో సెమినార్లు, అవసరమైన శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వీటికి అదనంగా భద్రత మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి వ్యక్తిగత కౌన్సిలింగ్‌ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భద్రతా అంశాలకు సంబంధించి తప్పనిసరిగా అన్ని స్టేషన్లలో పర్యవేక్షణను మరింత పెంచాలని జీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement