కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. పిట్లం మండలం చిల్లెర్గి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ చిల్లెర్గి గ్రామానికి చేరుకొని మృతులకు నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కాగా, ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి వద్ద జరిగిన లారీ-ఆటో ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెంది మరో 14 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పిట్లం మండలం చిల్లర్గి వాసులు, పెద్దకొడపగల్ మండలం తుగ్దల్, కాటేపల్లి, బాన్సువాడ పట్టణానికి సంబంధించిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. బాన్సువాడ ఏరియా హస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే అధికారులను, వైద్యులను స్పీకర్ పోచారం ఆదేశించారు.
కాగా, రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.