నైరుతి రుతుపవనాలు తెలంగాణను పలకరించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఖమ్మం సిటీలో సోమవారం రాత్రి భారీ వర్షం బీభత్సాన్సి సృష్టించింది. దీంతో ఖమ్మంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులు , ఉరుములు, మెరుపులు, పిడుగులతో భయంకరమైన వాతావరణం నెలకొంది. భారీగా వర్షం కురవడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ఖమ్మం సిటీతో పాటు జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసినట్టు తెలుస్తోంది. ఖమ్మం నగరంలోని రోడ్లపై వరదనీరు వాగులను తలపించింది.
ఇక.. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. మధిర, బోనకల్, చింతకాని, మండలంలోనూ ఈదురుగాలులతో వర్షం ఈడ్చి కొడుతోంది. వైరా, కొణిజర్ల మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఏపీలోని ఎన్‌టీఆర్, ఏలూరు జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పిడుగుపాటుకు ఉదయం ముగ్గురు, సాయంత్రం మరొకరు చనిపోయారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా పలు ఏరియాల్లో భారీ వర్షమే కురుస్తోంది.