త్వరలో ఓడలు బండ్లు అవుతాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రైతు నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మూడు నెలల్లో తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుని 4 నెలలు అవుతున్నా.. హామీలు మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు. అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌ల్లో సాగు నీటి కొరత ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నుంచి నీరు తెచ్చి 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. లేకుంటే నిజాంసాగర్ ప్రాజెక్టు క్రింద రైతుల పరిస్థితి మరోలా ఉండేదన్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారు.. అందరం మానవత్వంతో మద్దతుగా ఉండాలని పోచారం విజ్ఞప్తి చేశారు.