Friday, November 22, 2024

TS | ఆస్తి కోసం గొడవ.. తండ్రి మృతికి కారణమైన కొడుక్కు కఠిన జైలు శిక్ష

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : ఎనభై ఏళ్ళ కన్న తండ్రిని కడతేర్చిన కొడుక్కు ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత గురువారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన ఇరవై పేజీల తీర్పులోని అంశాలు.. మోర్తాడ్ మండల కేంద్రంలో నివాసముంటున్న యెరుగట్ల గంగారాంకు ఇద్దరు కుమారులున్నారు. రవి, రాజుతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు రాణి,లావణ్య ఉన్నారు. గంగారాం పడగల్ గ్రామం నుండి మోర్తాడ్ కు లక్ష్మి అనే మహిళను వివాహం చేసుకుని ఇల్లారకం అల్లుడిగా వచ్చాడు. తన భార్య నుండి వారసత్వంగా రావలసిన స్థిరాస్తి విషయంలో కులపెద్దలతో మాట్లాడి సదరు ఆస్తిని పంచుకుని తనకు ఇప్పిస్తలేడనే విషయంలో చిన్న కుమారుడు రాజు తండ్రితో అప్పుడప్పుడు ఘర్షణ పడేవాడు.

2018 జులైలో రాజు బాగా తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్ర తీసుకుని తండ్రి కడుపులో కొట్టడంతో అతను చనిపోయాడు. ఈ కేసులో న్యాయస్థానం విచారణలో నేరం చేసినట్టు రుజువు కావడంతో తండ్రి మృతి కి కారణమైన అతనికి ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్ష తో పాటు వేయి రూపాయల జరిమాన విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. మోర్తాడ్ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిడుగు రవిరాజ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement