Wednesday, January 29, 2025

TG | సొమ్మొకరిది.. సోకొకరిదా.. ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్

  • కేంద్రం మంజూరు చేస్తే.. ఇందిరమ్మ పేరు పెడతారా..
  • ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయం..
  • రేషన్‌ కార్డులపై ప్రధాని ఫోటో ముద్రించాలి..
  • లేదంటే బియ్యం ఎందుకు ఇవ్వాలి..
  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫైర్‌


కరీంనగర్‌, జనవరి 25 (ఆంధ్రప్రభ): సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మేయర్‌ సునీల్‌ రావుతో పాటు- పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరగా, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమన్నారు. ప్రధాని ఫోటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. కరీంనగర్‌ అభివృద్ధికి నిధులు తెచ్చిందెవరో కేంద్ర మంత్రి రాకతో ప్రజలకు తేటతెల్లమైందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీజేపీదేనన్నారు. కేంద్రం నుండి నిధులు తెచ్చినా గత 10ఏళ్లుగా ఏనాడూ బీఆర్‌ఎస్‌ నన్ను పిలవలేదని, స్మార్ట్‌ సిటీ- పైసలు రాకుండా నేను కొట్లాడి తెస్తే.. నన్ను పిలవకుండా బీఆర్‌ఎస్‌ నేతలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారన్నారు.

స్మార్ట్‌ సిటీ నిధులను దారి మళ్లిస్తే నేను కొట్లాడితేనే ఆ నిధులను కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు. ఇంతకష్టపడ్డా.. నన్ను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా ఇబ్బంది పెట్టారన్నారు. మోదీ ప్రభుత్వం అందించిన నిధుల వల్లే కరీంనగర్‌ లో అభివృద్ధి జరిగిందన్న విషయం ప్రజలకు అర్ధమైందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయాయని, బీఆర్‌ఎస్‌ అడుగుజాడల్లోనే కాంగ్రెస్‌ నడుస్తోందన్నారు. కేసీఆర్‌ అడుగుజాడల్లోనే రేవంత్‌ రెడ్డి నడుస్తున్నారని, రేవంత్‌ రెడ్డి గురువు కేసీఆరేనన్నారు. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, డ్రగ్స్‌, ఫాంహౌజ్‌ సహా స్కాంలన్నీ మరుగున పడ్డాయన్నారు. ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ రేపే అరెస్ట్‌ అంటూ.. నెల రోజులు ఊదరగొట్టి ఏం సాధించారని ప్రశ్నించారు.

కేటీఆర్‌ అరెస్ట్‌ కు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తరువాత కూడా ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదన్నారు. కేసీఆర్‌ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈఫార్ములా కేసును అటకెక్కించారని, గ్రీన్‌ కో వంటి సంస్థలను భయపెట్టడం వల్ల ఏం లాభమని, గ్రీన్‌ కో సంస్థ నుండి కాంగ్రెస్‌ పార్టీకి చందాల రూపంలో పైసలు ముట్టాయని ఆరోపించారు. పార్టీ చందాల పేరుతో పైసలు తీసుకుని మళ్లీ ఆ సంస్థనే ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పుడు దావోస్‌ పెట్టుబడులతో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు దావోస్‌ పర్యటనల్లో ఎన్ని పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి..? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారు..? ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి..? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్‌ కు ఉందా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

బీఆర్‌ఎస్‌ స్కాంలపై దారి మళ్లించేందుకు దావోస్‌ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందక చస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్‌ బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించరన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్రం నిధులే కారణమని, కేంద్రం నిధులిస్తే దొబ్బిపోతున్న పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే… కేంద్రం నుండే నిధులు తెచ్చి కార్పొరేషన్‌ ప్రజలందరికీ 24 గంటలపాటు నీళ్లందిస్తామన్నారు. భూకబ్జాలకు పాల్పడే వారిని బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement