మరిపెడ, (ప్రభ న్యూస్): సినీ ఫక్కీలో లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్‌ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన మహబుబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఇవ్వాల (మంగళవారం) జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్న సుమారు 100కిలోల ఎండు గంజాయిని మరిపెడ సీఐ సాగర్ ఆధ్వర్యంలో సీజ్ చేసినట్టు తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఖమ్మం కాకతీయ కళాతోరణం వద్ద రాజస్థాన్ నుంచి వస్తున్న లారీని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే.. పోలీసులను చూసిన లారీ డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి దగ్గర్లోనే పెట్రోల్ బంక్ వద్ద లారీని నిలిపేసి పరారయ్యారు. కాగా, లారీ ఖాళీగా ఉండడం చూసిన పోలీసులు అవాక్కయ్యారు. అయినా లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోవడంతో దీంట్లో ఏదో కిటుకు ఉందని అర్థమయ్యింది.
దీంతో ఆ లారీని పట్టి పట్టి సీఐ సాగర్ పరిశీలించడంతో ప్రత్యేకంగా క్యాబిన్ ఉన్న విషయం అర్థమయ్యింది. లోకల్‌గా ఉండే వెల్డింగ్ వ్యక్తిని పిలిపించి దాన్ని కట్ చేసి చూడగా అందులో సుమారు 20 ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని విప్పి చూడగా.. దాదాపు 100 కిలోల గంజాయి బయటపడింది. మార్కెట్లలో దీని విలువ సుమారు రూ.10లక్షల దాకా ఉంటుందని సీఐ సాగర్ అంచనా వేశారు. లారీతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని లారీ ఓనర్, పరారైన మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. లారీ రాజస్థాన్‌కు చెందిన మహిపాల్ పాచాల అనే వ్యక్తిది అని గుర్తించారు. దీంతో పాటు సిద్దిక్ ఖిన్ స్వర్, బాన్సి లది రాజస్తాన్‌లోని జోద్ పూర్‌గా గుర్తించామని త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ. రఘు, సీఐ ఎన్. సాగర్ నాయక్, మరిపెడ ఎస్ హెచ్ వో దూలం పవన్ కుమార్, ఎస్ఐ సంతోష్, పీసీలు క్రాంతి కుమార్, తదితరులున్నారు.