Thursday, January 23, 2025

Smart Exclusive – మెడి’కిల్స్’ – తెలంగాణ‌లో రెచ్చిపోతున్న డ్ర‌గ్‌ మాఫియా

లైఫ్ సేవింగ్స్ మెడిసిన్స్ పేరుతో బిజినెస్​
డాక్ట‌ర్ల‌ను మంచి చేసుకునేందుకు గిఫ్టుల ఎర‌
కాస్ట్‌లీ గిఫ్ట్‌లు, ఫారెన్ టూర్లు, ప్ర‌త్యేక ప్యాకేజీలు
నాణ్య‌త లేని మందులు మార్కెట్ చేసేందుకు ప్లాన్‌
తొలుత రిప్రెజెంటెటీవ్స్‌తో క‌లిసి బిజినెస్ ప్రారంభం
బ్యాచ్ నెంబ‌ర్ల పేరుతో న‌కిలీ మందుల స‌ర‌ఫ‌రా
అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపంతోనే ఆగ‌డాలు
ఉత్త‌రాదిని కేంద్రంగా చేసుకుని కొన‌సాగుతున్న దందా
ఏటా పెరుగుతున్న మెడిక‌ల్ షాపుల నేరాలు
ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న సామాన్య జ‌నం

ఆంధ్రప్రభ, సెంట్రల్​ డెస్క్​: మెడికల్​ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. లాభాల కోసం ప్రజల ప్రణాలను ఫణంగా పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం సుద్దతో ట్యాబ్లెట్స్​ తయారు చేసి ఆకర్షణీయమైన ప్యాక్​లో పెట్టి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీనికి కొంతమంది లంచగొండి అధికారుల సాయం కూడా ఉన్నట్టు సమాచారం. గతంలో ఫార్మ‌సీ కంపెనీలు తమ వ్యాపార అభివృద్ధికి రిప్ర‌జెంటివ్‌లను నియ‌మించి సేల్స్ ప్ర‌మోట్ చేసేవి. అయితే.. ఆయా రిప్ర‌జెంటివ్‌లు మెడిక‌ల్ స్టోర్స్‌లో ఉన్న ఫార్మ‌సిస్ట్‌ల‌ను క‌ల‌సి డ్ర‌గ్‌కు సంబంధించిన కాంపొజిష‌న్ చెప్పి, ఆ త‌ర్వాత డాక్ట‌ర్ దగ్గరకు వెళ్లి ఏ త‌ర‌హా రోగుల‌కు మందులివ్వాలో వివ‌రించే వారు.

- Advertisement -

ఇటు ఫార్మ‌సిస్ట్‌, డాక్ట‌ర్ ఇద్ద‌రు క‌ల‌సి వాటి నాణ్య‌త‌ను తెలుసుకుని రోగుల‌కు వాటిని అందించేవారు. అయితే.. రానురాను మెడికల్​ రంగం అంతా పూర్తిగా వ్యాపార దృక్ప‌థంగా మారడంతో కంపెనీల‌కు చెందిన మేనేజ‌ర్లు నేరుగా డాక్ట‌ర్ల‌ను క‌లిసి ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. గిఫ్ట్‌లు, విదేశీ టూర్లపేరుతో ఆశ చూపుతున్నారు. ఇట్లా ఎన్నో రక రకాల ఆశ‌లు కల్పించి వారిని బుట్టలో వేసుకుని నకిలీ మందులను అంటగట్టేలా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నాణ్య‌త‌లేని మందులు మార్కెట్‌లోకి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది.

లాభాల కోసం నకిలీ మందులు..

సాధార‌ణంగా మేనేజ‌ర్లు, య‌జ‌మానులు నేరుగా సేల్స్ కోసం డాక్ట‌ర్ల‌తో మాట్లాడుకోవ‌డంతో రిప్రజెంటేటీవ్స్‌ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. సేల్స్‌ను బ‌ట్టి జీతాలు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌డంతో వారు ఆర్థిక ఇబ్బందులతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు రిప్ర‌జెంటెటీవ్స్‌ కూడా చిన్న‌చిన్న బిజినెస్ మెన్‌ల‌తో చేతులు క‌లిపి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ రిప్ర‌జెంటెటీవ్స్‌ నుంచి మెడిసిన్స్ స‌ప్ల‌య్‌, సేక‌ర‌ణ‌కు సంబంధించిన‌ కీల‌క విష‌యాలు తెలుసుకున్న త‌ర్వాత బిజినెస్ ప‌ర్స‌న్స్ వారిని ప‌క్క‌న పెడుతున్నారు. ఈ వ్యాపారంలో మ‌రింత గ‌డించ‌డం కోసం నాణ్య‌త కొర‌వ‌డిన మందుల కంపెనీల‌తో ఒప్పందం కుదుర్చుకుని మార్కెట్‌లోకి న‌కిలీ మెడిసిన్స్ తీసుకొస్తున్నారు. ఇట్లా మార్కెట్‌ను క్ర‌మ క్ర‌మంగా బిజినెస్ ప‌ర్స‌న్స్‌ ఆక్ర‌మించుకుంటున్నారు. ఇటు డాక్ట‌ర్ల‌ను, అటు డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల‌ను మంచి చేసుకుని మెడిసిన్స్ వ్యాపారం గుట్టుగా సాగిస్తున్నారు.

అంతా ముడుపుల మయం..

సాధార‌ణంగా ప్ర‌తి డ్ర‌గ్‌కు ఒక బ్యాచ్ నెంబ‌ర్ ఉంటుంది. కంపెనీ ఇమేజ్ లేకుండా కొంద‌రు వ్యాపారుల‌కు బ్యాచ్ నెంబ‌ర్ తీసుకుని వాటి ద్వారా మార్కెట్ చేస్తే ఎక్కువ లాభాలు వ‌స్తుంటాయ‌ని న‌మ్మ‌బ‌లుకుతారు. వ్యాపార‌మే ల‌క్ష్యంగా ఉన్న బిజినెస్ మెన్ డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల‌కు ముడుపులు చెల్లించి ఒక బ్యాచ్ నెంబ‌ర్ తీసుకుంటారు. ఆ బ్యాచ్ నెంబ‌ర్ ద్వారా నాణ్య‌త‌లేని మందులు విక్ర‌యిస్తుంటారు. దీంతో మెయిన్ కంపెనీ వారు దొర‌క్కుండా, వారి ఇమేజ్ దెబ్బ‌తిన‌కుండా ఉంటుంద‌నేది వారి ఆలోచ‌న‌. ఈ విధంగా అటు వ్యాపారం.. ఇటు కంపెనీ ఇమేజ్ కాపాడుకుంటూనే నాణ్య‌త‌లేని మందులను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప‌ర్య‌వేక్ష‌ణ లోపం..

మెడిక‌ల్ స్టోర్స్‌, ఫార్మ‌సీల‌ను డ్ర‌గ్ కంటోల‌ర్ అధికారులు పూర్తి స్థాయిలో ప‌ర్య‌వేక్షించ‌డం లేదని ఆరోప‌ణ‌లున్నాయి. డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌నిఖీలు వ‌చ్చిన‌ప్పుడు ఫార్మ‌సిస్ట్ లేక‌పోయినా, షెడ్యూల్ బుక్స్ లేకున్నా, బిల్లులు ఇవ్వ‌క‌పోయినా, కాలం చెల్లిన మందులు ఉన్నా, ప్ర‌భుత్వం నిషేధించిన బ్యాచ్ నెంబ‌ర్ల మందులున్నా కేసులు బుక్ చేయొచ్చు. ఎన్నో ఫార్మ‌సీ కేంద్రాల్లో ఈ నిబంధ‌న‌లు పాటించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌తి అయిదేళ్ల‌కోసారి మెడిక‌ల్ స్టోర్స్‌కు ఇచ్చే ఫారం-20, 21 రిటెన్షన్ చేయించాల్సి ఉంటుంది. కానీ, చాలా మెడిక‌ల్ షాపుల్లో లైసెన్స్‌లన్నీ కాలం చెల్లిన‌వి ఉంటున్నాయ‌ని తెలుస్తోంది.

ఉత్త‌రాదిని కేంద్రంగా చేసుకుని..

దేశం మొత్తం మీద ఎక్కువగా ఉత్త‌రాదిలో త‌యారైన మందులనే విక్ర‌యిస్తున్నారు. అక్క‌డ త‌యారయ్యే మందులు ఆయా రాష్ట్రాల‌కు చెందిన వ్యాపారుల ద్వారా స‌ప్ల‌య్ చేస్తున్నారు. దీంతో కొంద‌రు చిన్న‌చిన్న కంపెనీలు ఏర్పాటు చేసుకుని ఆయా రాష్ట్రాల‌ ప‌రిధిలో కొత్త బ్యాచ్ నెంబ‌ర్ తీసుకుని మందులు విక్ర‌యిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది ద‌గ్గు మందు తీసుకున్న 20 మంది పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆ డ్ర‌గ్ హిమ‌చ‌ల్ ప్ర‌దేశ‌లో త‌యారైందిగా గుర్తించింది. అయితే.. ఆ బ్యాచ్ నెంబ‌ర్‌తో వ‌చ్చే ద‌గ్గు మందును ఇంత‌కుముందే కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించింది. కానీ, అదే బ్యాచ్ నెంబ‌ర్ల‌తో ఉన్న మందులు స‌ప్ల‌య్ అవుతున్నాయి. కాగా, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అలాంటి బ్యాచ్ నెంబ‌ర్ల మందులు లేవని అధికారులు చెబుతున్నారు. కాక‌పోతే.. అక్క‌డ త‌యారైన కాంపొజిష‌న్ ప్ర‌కారం ప‌రిశీల‌న చేస్తే ఆ బ్యాచ్ మందులు ఏపీ, తెలంగాణ‌లో దొరికేవని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ, అట్లా కాకుండా లోప‌కాయిరీగా మారిన కొంత‌మంది అధికారులు ఇచ్చిన స‌మాచారంతో అస‌లు దొంగ‌లు దొర‌క్కుండా త‌ప్పించుకున్నార‌నే వాద‌న‌లున్నాయి.

పెరిగిన మెడికల్ షాపుల​ నేరాలు..

తెలంగాణలో లైఫ్ సేవింగ్ మెడిసిన్‌కు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని డ్రగ్​ కంట్రోల్​ అడ్మినిస్ట్రేష‌న్‌ (డీసీఏ) వార్షిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో మెడిసిన్స్‌కు సంబంధించిన నేరాలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఔష‌ధ నియంత్ర‌ణ ప‌రిపాల‌న శాఖ (టీఎస్‌డీసీఏ) త‌న నివేదిక‌లో ప‌లు నేరాల వివ‌రాలను వెల్ల‌డించింది . వివిధ చట్టాలను ఉల్లంఘించిన కేసులు గ‌తం కంటే 61 శాతం పెరిగిన‌ట్టు తెలిపింది. 2024లో ₹7.46 కోట్ల న‌కిలీ మందుల‌ను, ఎలాంటి బిల్లులు లేని డ్రగ్స్‌ను సీజ్ చేసింది. ఇక‌.. ₹11.32 కోట్ల విలువైన నార్కొటిక్‌ మందులను సీజ్ చేయడానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖతో కలిసి పనిచేసింది. క్లినిక్‌లలో విక్రయించడానికి అక్రమంగా మందులను నిల్వ చేసిన ₹ 61.61 లక్షల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement