Thursday, November 21, 2024

Smart Exclusive – రేవంత్​ హై స్పీడ్​! అందుకోని యంత్రాంగం

పాలనా యంత్రాంగం పరుగులు
ఆరు గ్యారెంటీల అమలు అతిపెద్ద టాస్క్​
రాష్ట్రంలో విప్లవాత్మకంగా మారిన కొత్త పథకాలు
అధికారం చేపట్టగానే రెండు గ్యారెంటీలపై సంతకం
ప్రజలకు చేరువలో ప్రజాప్రతినిధులు
అందుబాటులోకి ‘ప్రజాపాలన’ ప్రోగ్రామ్​
అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం
భూ ఆక్రమణలు, చెరువుల కబ్జాలపై ఫోకస్​
ఓ ఎమ్మెల్యే చెరనుంచి చిన్నదామెర చెరువుకు విముక్తి
ఆక్టోపస్​ మాదిరిగా స్టేట్​ నార్కోటిక్ కంట్రోల్​ బ్యూరో
కేంద్ర, రాష్ట్రాల మధ్య పెరిగిన మంచి రిలేషన్స్​
అన్ని విధాలుగా సమన్వయంతో దూసుకెళ్తున్న రేవంత్​

2023 డిసెంబర్ 7 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విప్లవాత్మక ఆరు గ్యారెంటీల అమలు ఫైల్​పై తొలి సంతకం చేయడమే కాకుండా.. రెండో రోజే ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, నిరుపేదలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించే పథకాలు ప్రారంభించి తన దూకుడును ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతీ ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ‘ప్రజా పాలన’ అనే సరికొత్త కార్యక్రమాన్ని డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయితీలు, 3626 మున్సిపల్ వార్డుల్లో నిర్వహించి ఆరు గ్యారెంటీలలో ఐదింటికి సంబంధించి అర్హుల నుండి దరకాస్తులను స్వీకరించారు. ఇదే సమయంలో తమది గడీల పాలన కాదని, ప్రజాపాలన అని పేర్కొంటూ, హైదరాబాద్​లోని ప్రగతి భవన్ ను ‘మహాత్మా బాపు పూలే ప్రజా భవన్’గా మార్చడమే కాకుండా.. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్నిచేపట్టారు.

ప్రజావాణి పునరుద్ధరణ..

కొన్నేళ్లుగా జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ఆగిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్దరించి ప్రజా సమస్యల పరిష్కారానికై విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పునరుద్ధరించిన ప్రజావాణి కార్యక్రమంలో దాదాపు 60 శాతం భూ సంబంధిత ఫిర్యాదులు ఉండడం గమనార్హం. దీనికి లోపభూయిష్టంగా ఉన్న ధరణి పోర్టల్ విధానాన్ని సమూలంగా మార్చాలనే సంకల్పంతో భూ సంబంధిత అంశాలు, ధరణిలో చేపట్టాల్సిన మార్పులపై తగు సలహాలు, సూచనలు అందించేందుకు ఈ అంశంలో నిపుణులైన ప్రజా ప్రతిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం

ఇప్పటికీ ఈ కమిటీ, వివిధ వర్గాలతో పలు మార్లు సమావేశమైంది. అవుతున్నది. త్వరలోనే భూసంబంధిత సమస్యలకు ఈ కమిటీ పలు సూచనలను అందించనుంది. అదేసమయంలో అవినీతి అధికారులను సహించేది లేదనే బలమైన సందేశం వెళ్లేలా అవినీతి నిరోధక శాఖను యాక్టివ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే స్థాయి లీడర్లు అయినా చెరువులు, భూములను ఆక్రమించడం, కబ్జా చేయడం వంటి అంశాలను సీరియస్​గా తీసుకున్నారు. మల్కాజిగిరి జిల్లా దుండిగల్​ మండలంలోని చిన్న దామెర చెరువును ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆక్రమించి.. శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో వచ్చిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. వెంటనే సీరియస్​ యాక్షన్​ తీసుకుంది. జిల్లా కలెక్టర్​తో పాటు యావత్​ యంత్రాంగం తరలివచ్చి ఆక్రమణల లెక్క తేల్చింది. అంతేకాకుండా వారం రోజులుగా అక్కడ కూల్చివేతలు చేపట్టి.. చెరువుకు సరికొత్త బౌండరీలను ఏర్పాటు చేసింది. ఇది అటు కబ్జాదారుల్లో భయం కలిగించగా.. ప్రజల్లో సానుకూల అంశంగా మారింది. దీంతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న, వివిధ శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసి వాస్తవ పరిస్థితులను సీఎం రేవంత్​రెడ్డి ప్రజలముందుంచారు. వివిధ అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా.. ఈ కమిటీలు ఆయా రంగాల ప్రముఖులతో సమావేశమై వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నాయి. వీటితోపాటు, రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థిని ప్రతిబింబిస్తూ, రాష్ట్ర బడ్జెట్​ను ప్రభుత్వం నూతన విధానంలోప్రవేశ పెట్టింది.

మళ్లీ ప్రాణం పోసుకున్న డీఆర్​సీలు..

గతంలో అన్ని జిల్లాల్లో జిల్లా రివ్యూ కమిటీలు (DRC) ఉండేవి. వీటిని ఏడేళ్లుగా పునరుద్దరించలేదు. దీంతో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించే వేదికే లేకుండా పోయింది. కొత్త సర్కార్ రాగానే ఈ డీఆర్సీలను పునరుద్ధరించి, వాటి చైర్మన్​లుగా పక్క జిల్లాలకు చెందిన మంత్రులను నియమించారు. ఇక, రాష్ట్రంలోని యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

ఆక్టోపస్​ మాదిరిగా స్టేట్​ నార్కోటిక్​ కంట్రోల్​ బ్యూరో

రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఆక్టోపస్, గ్రే-హౌండ్స్ మాదిరిగా తెలంగాణ స్టేట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టారు. దీనికి అధిపతిగా అడిషనల్ డీజీ స్థాయి ఉన్నతాధికారిని నియమించారు. వివిధ పరిపాలనా సంబంధిత కారణాలపై ఆగిపోయిన దాదాపు 25వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ విప్లవాత్మక చర్యలను చేపట్టారు. నిరుద్యోగులకు స్వయంగా ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేశారు. అదనపు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్​ను ప్రకటించడంతోపాటు ఉద్యోగ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొని రూ. 40,232 కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారు.

- Advertisement -

కేంద్ర, రాష్ట్రాల మధ్య పెరిగిన రిలేషన్స్​..

కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మిన సీఎం రేవంత్​రెడ్డి.. అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదల కోసం చేసిన ప్రయత్నాలు సత్ఫాలితాలనిచ్చాయి. హైదరాబాద్​లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సైనిక ప్రాంతంలోని భూముల కేటాయింపు, రాష్ట్రానికి ఆర్థిక శక్తిగా మారనున్న రీజినల్ రింగ్ రోడ్​ను కేంద్ర ప్రభుత్వమే చేపట్టడం తదితర చారిత్రాత్మక నిర్ణయాలను సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement