తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
వ్యాపార ధోరణి అవలంబిస్తున్న నిర్వాహకులు
క్వాలిఫైడ్ పర్సన్స్ లేకుండానే మెడికల్ స్టోర్స్ నిర్వహణ
కాంపొజిషన్‌పై అవగాహన లేని వ్యక్తులతో మందుల విక్రయాలు
మార్కెట్‌లో దొరికే మందులన్నీ మంచివేనా?
డీసీఏ తనిఖీల్లో బయటపడుతున్న నకిలీ మెడిసిన్స్
గత ఏడాది 7.46 కోట్ల నకిలీ మందులు సీజ్
ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు
పెద్ద ఎత్తున నష్టపోతున్న వినియోగదారులు
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నకిలీ, కల్తీ మెడిసిన్స్ అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ స్టాండర్డ్స్‌పై తనిఖీలు చేయకపోవడం.. మెడిసిన్స్ మూలాలను వెతకకపోవడంతో కల్తీ పెరిగినట్టు సమాచారం. ఈ మధ్య డ్రగ్ ఆపీసర్లు చేస్తున్న తనిఖీల్లో పలు లోపాలు బయటపడుతుండడమే నిదర్శనం. తెలంగాణపై డ్రగ్స్ మాఫీయా, మత్తు పదార్థాల మాఫీయా, కల్తీ మాఫీయా ఇలా ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి. దానికి తోడు నాణ్యత లేని, నకిలీ మందులు కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను రక్షించే మందులకు సంబంధించిన నేరాల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 2024లో ₹7.46 కోట్ల విలువైన నాణ్యత లేని, కాలం చెల్లిన మందులను సీజ్ చేసింది. మెడికల్ షాపులు నిబంధనలు ఉల్లంఘించిన నేరాలు కూడా బాగా పెరిగాయి. 2023లో 56 కేసులుండగా.. అవి ఏడాదిలో 573కి పెరిగాయి. కల్తీ మందులను అడ్డుకోవలంటే క్షేత్ర స్థాయి నుంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఇట్లా పైపైన తనిఖీలు చేస్తే ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.
ఆ మందులన్నీ నాణ్యమైనా?
మార్కెట్‌లో లభ్యమవుతున్న మందులు నాణ్యమైనా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ సందేహం ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో ఉంది. మార్కెట్‌లో స్టాండర్డ్ కంపెనీలు, జనరిక్, చిన్న కంపెనీలు, వాటికి తోడు కార్పొరేట్ ఫార్మసీల ద్వారా మందులు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో కార్పొరేట్ ఫార్మసీలు, హాస్పిటల్ అటాచ్డ్ ఫార్మసీలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. ప్రభుత్వం అనుమతితో ఏర్పాటు చేసిన ఈ మందుల దుకాణాల ద్వారా విక్రయిస్తున్న మందులు ఎంత వరకు నాణ్యంగా ఉంటున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే వాటి నాణ్యతను నిపుణులు తప్ప మరెవరూ చెప్పలేరు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ స్టోర్స్ యాజమానులు చెప్పిన ప్రకారం మందులు వినియోగిస్తుంటారు. నగరాల్లో ఆస్పత్రుల్లో ఆయా డాక్టర్లు రాసే మందులు అక్కడ ఉన్న మెడికల్ స్టోర్స్‌లో తప్ప మరెక్కడా దొరకవు. కార్పొరేట్ ఫార్మసీలోనూ వారు సొంత బ్రాండ్‌పై ఉన్న ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తుంటారు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
సరైన వేతనాలు ఇవ్వలేక..
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ అంతటా అనేక మెడికల్ స్టోర్స్‌లో క్వాలిఫైడ్ పర్సన్స్ లేరన్నది వాస్తవం. ఫార్మసిస్ట్ లేకుండా, బిల్లు ఇవ్వకుండా ఏ మెడికల్ స్టోర్స్ నుంచి మందులు విక్రయించకూడదనే నిబంధన ఉంది. అలా బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అనేక మెడికల్ స్టోర్స్‌ల్లో క్వాలిఫైడ్ పర్సన్స్ కానరారు. ఎందుకంటే అందుకు తగిన వేతనాలు ఇవ్వకపోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.
టెన్త్ చదివిన వారితో మందుల విక్రయం..
సాధారణంగా డి-ఫార్మసీ, బీ-ఫార్మసీ అభ్యర్థులు ఇచ్చిన సర్టిఫికేట్లు ఆధారంగా మెడికల్ స్టోర్స్‌కు అనుమతి లభిస్తుంది. అందులో ఉద్యోగం చేస్తామని ఆయా అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత డ్రగ్ కంట్రోల్ పరిపాలన అధికారులు లైసెన్స్ మంజూరు చేస్తారు. కానీ అనేక మెడికల్ స్టోర్స్‌ల్లో లైసెన్స్ కోసం ఫార్మసీ సర్టిఫికేట్ ఇచ్చే వ్యక్తులు ఉండడం లేదు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. అయినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇక.. టెన్త్ చదివిన వారిని నియమించుకుని చాలాచోట్ల మందుల విక్రయం చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో బయటపడింది.
క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే..
అయితే.. క్వాలిపైడ్ పర్సన్స్ లేకపోవడంతో ఇక్కడ రెండు తప్పిదాలు జరుగుతున్నట్టు తనిఖీల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కొంత మంది డాక్టర్లు బ్రాండెడ్ పేరుతో ప్రిష్కిప్షన్ ఇస్తారు. అందులో ఉన్న కాంపొజిషన్ మందులు గురించి ఇచ్చేవారికి తెలియకపోవడంతో ఎలా వాడాలో కూడా చెప్పకపోవడంతో పేషెంట్స్ తమకు నచ్చిన రీతిలో వినియోగిస్తున్నారు. దీనివల్ల కూడా అనేక సమస్యలు ఏర్పడుతున్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు. అదీగాక మందుల కాంపోజిషన్ తెలియకపోవడంతో ఓవర్ లుక్‌లో డాక్టర్ రాసే మందులకు బదులు వేరే వాటిని కూడా ఇచ్చే ప్రమాదం ఉంది. క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే పేషెంట్స్‌కి తగిన సలహాలిచ్చే అవకాశం ఉంటుంది.