Tuesday, November 19, 2024

Smart Exclusive – ఉద్దండుల మధ్య..సమరం!తెలంగాణలో పొలిటికల్​ గేమ్

అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో రాజకీయ వేడి
గజ్వేల్, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కొడంగల్, పాలేరు తదితర అసెంబ్లీ సెగ్మెంట్లు అత్యంత కీలకం
కామారెడ్డిలో రేపు సీఎం కేసీఆర్ నామినేషన్​
కొడంగల్​లో నామినేషన్​ వేసిన రేవంత్​రెడ్డి
గజ్వేల్​లో నామినేషన్​ దాఖలు చేసిన ఈటల
పోటాపోటీ ప్రచారాలు, మాటల బాణాలు
టార్గెట్​ కేసీఆర్​ అంటున్న ప్రతిపక్ష నేతలు
కేసీఆర్​ మీద పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అంటున్న కేటీఆర్​

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రంజుగా, రసకందాయంగా జాగుతున్నాయి. ఆయా పార్టీల అధినేతలు పోటీ చేసే స్థానాల్లోనైతే.. పరిస్థితి మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇక తేల్చుకుందాం.. అంటూ తలపడుతున్న గజ్వేల్, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కొడంగల్, పాలేరు తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతిరోజూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణల రాజకీయ వేడిని పెంచేస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని పార్టీలు ఇక ప్రచార జోరు పెంచుతున్నాయి. మరోవైపు కీలక నేతల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. బీఆర్​ఎస్​ దళపతి, సీఎం కేసీఆర్‌ 9వ తేదీన నామినేషన్‌ వేయాలని నిర్ణయించగా, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మంగళవారం కొడంగల్​లో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సోమవారమే నామినేషన్‌ వేసేశారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రాజకీయం మంచి మజా ఇవ్వబోతోంది. ఈ రెండు నియోజకర్గాల్లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల కూడా గురువారం నామినేషన్‌ వేయనున్నారు.

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో:
గులాబీ దళపతి కేసీఆర్​ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీ చేయడానికి ముందకు రావడం ఆసక్తికరంగా, సందేహత్మకంగా మారింది. ఎందుకు కామారెడ్డికి వస్తున్నారన్న చర్చ కామారెడ్డితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అయితే.. ఈ విషయమై కేసీఆరే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను గజ్వేల్‌లోనే ఉంటానని, కానీ, కామారెడ్డిలో పోటీకి కథ వేరే ఉందని గజ్వేల్‌ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. దీంతో కామారెడ్డి కథ ఏంటన్న అనుమానాలు, అనేక సందేహాలు మొదలయ్యాయి. కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్నుపడిందని విపక్షాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. విపక్షాల ఆరోపణలను బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎలాగైనా విపక్షాల వ్యూహాన్ని తిప్పికొట్టాలని, గెలిచి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. ఆ బాధ్యతను యువనేత, మంత్రి కేటీఆర్​కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన రామారావు.. ఇటీవల రెండు రోజులు కామారెడ్డిలోనే మకాం వేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేశామని ప్రకటించారు. ఈమేరకు ఉత్తర్వులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కేసీఆర్‌ వస్తే కామారెడ్డి మరో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. అందుకే కేసీఆర్‌ను గెలిపించాలన్న బలమైన నినాదంతో ప్రచారం కొనసాగుతోంది.

టార్గెట్​ కేసీఆర్​.. గజ్వేల్​ బరీలో ఈటల
ఇదిలా ఉంటే.. గజ్వేల్, కామారెడ్డిలో పోటీచేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఆందోళన కలిగిస్తున్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమేరకు బీజేపీ అధిష్టానం ఆయనకే టికెట్‌ ఇచ్చింది. ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌పై బరిలో దిగాలని నిర్ణయించారు. అందుకు ఏఐసీసీ అంగీకారం తెలిపింది. దీంతో తెలంగాణలో అసలైన మజా, ఉత్కంఠను రేకెత్తించే రాజకీయాలు మొదలయ్యాయి. సాధారణంగా పెద్ద నాయకులు బరిలో ఉన్న చోట చిన్న నాయకులను నిలిపే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ, ఈ సంప్రదాయానికి భిన్నంగా ప్రస్తుత ఎన్నికల్లో ఈటల, రేవంత్‌ ముందడుగు చేశారు. కేసీఆర్‌ టార్గెట్‌గా పోటీకి సిద్ధమయ్యారు.

ఎవరు గెలిచినా రాజీనామా చేసుడే..
అయితే, కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల నేతలు ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డి ముగ్గురూ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డిలో గెలిస్తే కామారెడ్డిని వదులుకోవడం ఖాయం. ఇక ఈటల రాజేందర్‌ హుజూరాబాద్, గజ్వేల్‌లో పోటీ చేస్తున్నారు. ఆయన రెండోచోట్ల గెలిస్తే గజ్వేల్‌ను వదులుకుంటారు, రేవంత్‌రెడి కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో నిలస్తున్నారు. ఆయన రెండు చోట్ల గెలిస్తే కామారెడ్డిని వదులుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement