Tuesday, November 19, 2024

TS : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారేజ్ ల‌లో చేరాయి ….కిష‌న్ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఆరు గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప్‌ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హామీల అమలు కోసం నిధులు సమకూర్చడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కర్ణాటకలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మండిపడ్డారు.

మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా… ఓవైసీ ,కేసీఆర్, రాహుల్ గాంధీ ఎంతమంది దిగొచ్చిన మోదీని అడ్డుకోలేరన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని మరోసారి స్పష్టం చేశారు.
‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ఆవశ్యకత లేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు ఎజెండా లేదు. ఆ పార్టీ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. అధికార దుర్వినియోగం, అహంకారం, అవినీతి వల్లే ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయం. దేశంలో తొమ్మిదిన్నరేళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. బీజేపీ విజయసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

వోకల్ ఫర్ లోకల్ నినాదంతో చేనేత ఉత్పత్తులకు ప్రచారం
వోకల్ ఫర్ లోకల్ నినాదంతో చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉండడమే కాక ప్రధానమంత్రి మోదీ స్వయంగా వారంలో ఒకరోజు తప్పకుండా చేనేత వస్త్రాలు ధరిస్తారని పేర్కొన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నేడు నారాయణ పేటలో నేతన్నలను కలిసి ఆయ‌న మాట్లాడారు.. నారాయణ పేటలో చీరలు నేస్తున్న నేతన్నలతో పాటుగా కాసేపు మగ్గం నేసి, అక్కడి నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భ‌గా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ, నేత‌న్న‌ల‌ను ఆదుకునేందుకు మోదీ ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌వేవ‌పెట్టార‌ని,వాటిని వినియోగించుకోవాల‌ని కోరారు.

మేడారం జాత‌ర‌…శుభాకాంక్ష‌లు తెలిపిన కేంద్ర మంత్రి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ‘సమ్మక్క సారక్క మేడారం జాతర’ ప్రారంభం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ జాతర భారతీయ సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అభివ‌ర్ణించారు. సమ్మక్క, సారక్కల జీవితాలు, స్ఫూర్తిదాయకం, అన్యాయాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ ఆదర్శంగా నిలుస్తుంది అని శుభాకాంక్ష‌ల సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement