అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కానుకలు తరలివస్తున్నాయి. ఇప్పటికే తిరుమలతిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించారు. అలాగే పలు చోట్ల నుంచి కూడా కానుకలను అందజేశారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీతమ్మకు కానుకగా అందించేందుకు బంగారు చీరను నేశాడు.
చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ రామాయణంలోని ఏడు ఖండాల్లో గల ముఖ్య ఘట్టాలను పది ఇతివృత్తాలుగా చేసుకుని బంగారు చీరను నేశారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించి చీరను నేసినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా హరి ప్రసాద్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అలాగే జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లనున్న హరిప్రసాద్.. సీతమ్మ కోసం నేసిన చీరను మోదీకి చూపించనున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించనున్నారు.