గిరిజనేతరుల భూములకూ పట్టాలు ఇస్తాం, ప్రస్తుతం కేంద్రం అడ్డంపడుతోంది. ఎన్నికల తరువాత పోరాడుతాం, గిరిజనేతరులకు పట్టాలు ఇస్తామని తెలంగాణ సీఎం కే.చంద్ర శేఖర్ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాభిమాన సభలో ఆయన పాల్లొన్నారు. ఈ సభకు ముస్లీంలు, హిందువులు అనే తేడాలేకుండా అశేష జనవాహిని పరవళ్లు తొక్కింది. జనాన్ని చూసి.. ఇక్కడి అభ్యర్థి కోనప్ప విజయం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్టంలోని నియోజకవర్గాల్లోనే సిర్పూర్ కాగజ్ నగర్ అగ్రస్థానంలో ఉందని, శాసన సభ్యుడు కోనప్ప కూడా పనితీరులో టాపర్గా నిలిచారని కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఢిల్లీలోనూ, రాష్ర్టంలోనూ 50 కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చామని, తాము వద్దంటే బలవంతంగా తమను ఆంధ్రప్రదేశ్లో కలపటంతో 58 గోస పడ్డామన్నారు. అప్పట్లో కాగజ్నగర్ ఎలా ఉందో.. తెలంగాణ కూడా అలాగే ఉందన్నారు. తాగు నీరు లేదు. సాగు నీరు లేదు. కరెంటు లేదు. పని లేదు. వలస పోతేనే బతుకు. రైతుల ఆత్మహత్యలు, పరిశ్రమల మూత ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు.
కాగజ్ నగర్లోనూ ఇవే సమస్యలు ఉండేవి. మంచమెక్కిన మన్యం అనే వార్తలు ప్రతికల్లో వచ్చేవి. ఇప్పుడు ఆ సమస్యలు లేదు. విద్య, ఆరోగ్యం, కరెంటు, సాగునీటి సమస్యలు లేవు. మిషన్ భగీరథతో సాగునీరు లభించింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలు పెరిగాయి. గోండు గూడేలు, లంబాడీ తండాలు, ఆది వాసీ ప్రాంతాలకు మిషన్ మిషన్ భగీరథ తో తాగునీరు లభిస్తోంది. గతంలో ఓ తల్లి ప్రసవించాలంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలి. ఇప్పుడు ఆ బాధ తప్పింది. అమ్మ వడి పథకంలో కాన్పు చేయించటమే కాదు.. పుట్టిన ఆడపిల్లకు రూ.13,500లు, మగబిడ్డకు రూ.12,000 చెల్లిస్తూ కేసీఆర్ కిట్ను అందజేస్తున్నాం. కాగజ్ నగర్ అంటే మినీ ఇండియా. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. రైల్వేలైనుంది. హైవే రోడ్లు ఉన్నాయి. పేపర్ మిల్లు ఉంది. ఉత్పత్తి పెరిగింది. మరో మిల్లు కావాలని ఎమ్మెల్యే కోనప్ప అడుగుతున్నారు. జరిగిన అభివృద్దిని గమనించండి. అభివృద్ధి కోసం ఓటెయ్యండి. రైతుబంధు , ధరణి , 24 గంట విద్యుత్తు వద్దని కాంగ్రెస్ నాయకులు గోల చేస్తున్నారు. ఈ సదుపాయాలన్నింటినీ రద్దు చేయాలంటున్నారు. ధరణి పోర్టల్ లేకుండా రైతు బంధుకు, రైతుబీమాకు నిధులు ఎలా వస్తాయో ఆలోచించండని కేసీఆర్ ప్రజలకు వివరించారు.
1019 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లందరికీ మంచి విద్యాసౌకర్యం లభించింది. పేదల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదుగుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎవరికీ పట్టం కట్టాలి. ఒక్కసారి ఆలోచించండి, విజ్ఞతతో ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ దోకా పార్టీ. 2004లో తెలంగాణ ఇస్తామని ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కేంద్రం, రాష్ర్టంలో అధికారం చేజిక్కించుకుని తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఆ తరువాత కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ ఇచ్చుడో తేల్చుకోవాలని ఆమరణ దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చినా మళ్లీ మోసం చేసింది. కడకు విద్యార్థులు, ఉద్యోగులు కలిసి సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ ఇచ్చారు.గత పదేళ్ల కాలంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకువెళ్లిన బీఆర్ఎస్ను నమ్ముతారా? దగా చేసిన కాంగ్రెస్ను నమ్ముతారా? ఆలోచించండని ప్రజలను కేసీఆర్ కోరారు.