సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో పలుసార్లు లేఖలు రాశామని, వ్యక్తిగతంగా సమావేశమైన సమయంలోనూ ఈ విషయమై గుర్తు చేసినా దురదృష్టవశాత్తు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత, జైళీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
అవసరమైన వ్యవస్థ, వనరులు లేని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పథకాలు సహాయాన్ని ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.. దీని వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టమన్నారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ఇకనైనా ఆలస్యం చేకుండా మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.