- ఉపాధి లేదు.. ప్రైవేటు ఫైనాన్స్ వేధింపులు
- అప్పుల తిప్పలు భరించలేక బలవన్మరణం
- సూసైడ్ నోట్.. సిరిసిల్లలో విషాదం
సిరిసిల్ల, డిసెంబర్ 20 (ఆంధ్రప్రభ): నన్ను క్షమించండి.. అంటూ మరో నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఓవైపు ఉపాధి కరువై.. మరో వైపు నెలనెలా కట్టాల్సిన ఈఎంఐల కోసం వేధింపులు తీవ్రం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేతన్న రాసిన సూసైట్ నోట్ కుటుంబ సభ్యులతో పాటు అందరిని కంటతడి పెట్టించింది..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన నేత కార్మికుడి ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. పని లేక ఉపాధి లేక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో నేత కార్మికుడు పేర్కొన్నాడు. ఇద్దరు ఆడబిడ్డలను, భార్యను అనాథలుగా మిగిల్చి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆర్థిక ఇబ్బందులు.. వేధింపులు..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ నగర్‌కు చెందిన దూస గణష్ (50) అనేక సంవత్సరాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు కార్మికులు ఉపాధి పొందుతున్నాడు. కొంతకాలంగా వస్త్ర పరిశ్రమలో సంక్షోభం మూలంగా ఉపాధి లేకపోవడంతో గణేష్‌ను పరిస్థితులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితిలో తీవ్రంగా మనస్తాపం చెందిన గణేష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, తన చావుకు పనిలేని పరిస్థితి, అర్బన్ బ్యాంక్, ఓలా, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం చర్చనీయాంశంగా మారింది. రూ.5లక్షల వరకు అప్పులైనట్టు గణేష్ లేఖలో పేర్కొన్నారు. లేఖలో తనను క్షమించాలని కుటుంబ సభ్యులను కోరడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మృతునికి భార్య సువర్ణ, ఇద్దరు కూతుళ్లు సుమశ్రీ, పూజిత ఉన్నారు. గణేష్ ఆత్మహత్య ఘటన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్ల ను ఉరిసిల్లాగా మార్చిన సీఎం రేవంత్ : కేటీఆర్ ఆగ్రహం
ఇక ఈ సంఘటన పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. సర్కారు చేతిలో మరో నేతన్న బలి అయ్యాడని మండిపడ్డారు.. ఇక నావల్ల కాదు అని దూస గణేష్.. తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని ఎమోషనల్ అయ్యారు. సంవత్సర కాలంగా సాంచాలు సరిగా నడవకపోవడం, ఉపాధి లేక, పని దొరకపోవడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
సిరిసిల్లను మళ్లీ ఉరిసిల్లగా మారుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. వినిపిస్తున్నాయా ఆ చిన్నారుల ఆర్తనాధాలు? అంటూ కేటీఆర్ నిలదీశారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన మీరు వెళ్లి ఆ కూతుళ్లకు చెప్పండి.. ప్రభుత్వం కక్ష సాధింపుల్లో క్షణం తీరికలేకుండా ఉంది అని!.. నేతన్నలైనా, రైతన్నలైనా తమ బిడ్డలను అనాథలుగా వదిలి వెళ్ళాల్సిందే అని… మరణ వాంగ్మూలాలు, అప్పుల చిట్టాలే…. వారి బిడ్డలకి దక్కే ఆస్తులు అని కేటీఆర్ ట్వీట్ పేర్కొన్నారు.