Thursday, November 21, 2024

Siricilla – కోచింగ్‌ లేకుండానే .. కొలువులు కొట్టారు

గ్రంథాలయ ఒడి నుంచి చదువులమ్మ బడికి
పాఠకులుగా వచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా మారి
భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి దాయకం

సిరిసిల్ల, (ఆంధ్రప్రభ):
”చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో” అంటారు కందుకూరి వీరేశలింగం పంతులు. చదివే ఆసక్తి ఉన్న కొనే ఆర్థిక పరిస్థితి లేని వారికి గ్రంథాలయలూ అమ్మ ఒడిలాంటివి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంధాలయ సంస్థ ఎంతోమంది నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తయారుచేసి ఎందరికో స్ఫూర్తిని అందిస్తుంది. పోటీ- పరీక్షల్లో నిలబెట్టి విద్యార్థులకు విజయాలకు అందిస్తుంది. ఇటీవల జరిగిన పోటీ- పరీక్షల్లో జిల్లా గ్రంథాలయంలో పోటీ-పడి చదివి రాణిస్తున్న విద్యార్థులు ఎందరికొ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం..

పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు..

ఇటీవల జరుగుతున్న పోటీ పరీక్షల్లో జిల్లా గ్రంధాలయ రీడర్లుగా పలువురు విద్యార్థులు పోటీ పరీక్షలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో పోలీసుల ఎంపిక కోసం జరిగిన పోటీ పరీక్షల్లో పలువురు గ్రంథాలయంలో చదువుకొని విజయాలను సాధించి ఉద్యోగులుగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో సుమారు 60 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విజయాలను సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం గ్రంథాలయంలోని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పోటీ పరీక్షల్లో తమకు ఎంతో సహాయకారిగా నిలిచాయని ప్రభుత్వ ఉద్యోగులుగా మలచడంలో గ్రంథాలయం ఎంతో తోడ్పడినట్లు ఉద్యోగాలు విజయం సాధించిన విద్యార్థులు తెలుపుతున్నారు. తమ కృషికి తోడుగా గ్రంథాలయం నిలబడిందని తెలుపుతున్నారు. పలువురు చదువరులు …రీడర్స్‌ క్లబ్​గా ఏర్పడి ఎప్పటికప్పుడు తమ అభిప్రాయం పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే పరిస్థితి లేదు..

- Advertisement -

డబ్బులు వెచ్చించి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే పరిస్థితి లేదు. తమ కుటుంబాలకు ఆర్థికంగా భారం కాలేక గ్రంథాలయంలో రీడర్‌గా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. పట్టుదలతో ప్రయత్నించి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగులయ్యారు. రికార్డు స్థాయిలో జిల్లా గ్రంధాలయంలో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం కొందరు విద్యార్థులు రెండు ఉద్యోగాలు పొందిన సందర్భాలున్నాయి. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ.. విద్యార్థులను తీర్చి దిద్దుతున్న గ్రంథాలయ సిబ్బంది తీరు అభినందనీయమని పలువురు కొనియాడుతున్నారు. ఈ గ్రంథాలయం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ఎందరో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి బతుకు ‘దారి’ చూపుతుందని ఆశిద్దాం.

రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యా..

పాముల రాజేంద్ర వర్మ, ఎస్‌జీటీ (21పిపిఎల్‌5)

జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యా. నాతో పాటు ఎంతోమంది విద్యార్థులు గ్రంథాలయంలోని చదువుకున్నారు. పోటీ పరీక్షల్లో రెండు ఉద్యోగాలు ఎంపికయ్యా. ప్రస్తుతం ఎస్జీటీగా ఉద్యోగం చేస్తున్నా. ఎస్‌జీటీలో జిల్లాస్థాయిలో రెండవ ర్యాంకు, గ్రూప్‌- 4లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం ఎస్‌జీటీగా విధుల్లో చేరా. జిల్లా గ్రంధాలయం ఎంతో స్ఫూర్తిని అందించింది. పట్టు-దలతో ప్రయత్నించి విజయం సాధించా.

గ్రంథాలయం తోడుగా నిలిచింది..

బొల్లి నవీన్‌ కుమార్‌, ఎస్‌జీటీ (21పిపిఎల్‌6)

పోటీ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతూ గ్రంథాలయంలో చదువుకున్నా. గ్రంథాలయం నాకు ఎంతో స్ఫూర్తిని అందించింది. ఇటీవల పోటీ పరీక్షల్లో ఎస్జీటీగా జిల్లాలో 8వ సాధించా. ఎందరో పేద విద్యార్థులకు గ్రంధాలయం తోడుగా నిలిచింది. జీవితంలో స్థిర పడేందుకు బాసటగా నిలిచింది.

జిల్లాలో మొదటి ర్యాంకు సాధించా..

అలిశెట్టి నవీన్‌, ఎస్‌జీటీ (21పిపిఎల్‌7)

కోచింగ్‌లకు వెళ్లే స్తోమత లేని వాళ్లకు గ్రంథాలయం తోడుగా నిలబడ్డది. గ్రంథాలయంలోని పట్టుదలగా చదివా. ఎస్జీటీగా పరీక్ష ఫలితల్లో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించా. నాలాగే ఎంతోమందిని గ్రంథాలయం అండగా నిలిచి పోటీ పరీక్షల్లో నిలబెట్టి ఉపాధ్యాయులుగా మలిచింది. ఈ గ్రంథాలయానికి ఎంతో రుణ పడి ఉంటాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement