సిరిసిల్ల – కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైందన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్. రెండు లక్షల రుణమాఫీ.. వందశాతం అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పానన్నారు. అయిన ఆ పార్టీలో చలనం లేదని అన్నారు. సిరిసిల్లలో నేడు జరిగిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..
కాంగ్రెస్‌కు పరిపాలన చేతకావడం లేదని చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి అంటూ విమర్శించారు.
ఇక మేడిగడ్డకు చిల్లు పడిందని కాంగ్రెస్ వీర ప్రచారం చేస్తున్నదని, అయితే వాస్తవానికి చిల్లుపడింది రేవంత్ బుర్రకంటూ సెటైర్ వేశారు.. ఇప్పుడు అవేనీళ్ళు హైదరాబాద్ తాగునీటి కోసం రేవంత్ రెడ్డి తీసుకెళుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో నాలుగు లక్షల పెళ్లిళ్లు అయ్యాయని.. వారికి కల్యాణలక్ష్మి ఇవ్వలేదన్నారు. రూ.7500 రైతుబంధు కాదుకదా.. 75 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
రైతు ప్రమాణపత్రం కేసీఆర్ హయాంలో అడుగలేదని.. రైతుబంధు ఇచ్చామన్నారు. 11 దఫాల్లో రూ.80వేలకోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమైందని వివరించారు. రైతులని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని.. రైతులను దొంగల్లా చిత్రీకరించే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం, ఐటీ ఉంటే రైతుబంధు కట్ అంటున్నారని.. సీఎం రేవంత్ కట్టింగ్ సీఎం అయ్యారన్నారు.
కోటిన్నర ఎకరాలకి నీళ్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టే కాళేశ్వరాన్ని బాగు చేయడం లేదని ఆరోపించారు. ప్రేక్షక పాత్ర కాదు అన్యాయం జరిగితే కోట్లాడాలని పిలుపునిచ్చారు. చిట్టినాయుడు ఏం పీకలేడన్నారు. అతివిశ్వాసం.. చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయామని.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్లీ వస్తాయన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా.. కేసీఆర్ జపం చేస్తున్నారన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం చెబుతున్నారని.. పరిపాలన చేతకాక మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రెగ్యులేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.