హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సింగిల్ పిక్ పత్తిని 45వేల ఎకరాల్లో సాగయ్యేలా చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన బీఆర్కే భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండే సింగిల్ పిక్ పత్తిసాగుపై చర్చించారు. ఈ కాటన్ ప్రోత్సాహక చర్యలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ పిక్ పత్తితో అధిక ఆదాయం, మంచి ఉత్పాదకతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 40శాతం అధిక దిగుబడులను సింగిల్ పిక్ పత్తి అందిస్తుందన్నారు. పలు దేశాలు ఈ పంటను సాగు చేస్తున్నాయని ఆయన వివరించారు. ఈ పంట సాగుకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెంచుకుందామని ఆయన సూచించారు.
గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్ నిర్వహించిన ప్రాంతాల్లో పత్తి సాగు ఏరియా విస్తరణను చేపట్టాలన్నారు. సింగిల్ పిక్ పత్తి విత్తడంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రైతులను చైతన్యపర్చాలని ఆదేశించారు. హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో సాంకేతికను ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సింగిల్ పిక్ పత్తిని సాగు చేసే రైతుల వివరాలను నమోదు చేయాలన్నారు. దీనికి రైతు ప్రొఫైల్, వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్ తదితర వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పీజేటీఎస్‌ఏయూ వీసి ప్రవీణ్‌రావు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్, ఉద్యాన వన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.