హైదరాబాద్, ఆంధ్రప్రభ: సింగిల్ ఇంజిన్ గ్రోత్ స్థిరమైందని రుజువవుతున్నది. ఏడేళ్ల చిరు ప్రాయంలోనే తెలంగాణ ఆర్ధిక పునాదులు అత్యంత బలోపేతమై దేశంలో పేరున్న రాష్ట్రాలను వెనుకకు నెడుతున్నది. ఆర్ధిక వృద్ధిలో సాటిలేదంటూనే పటిష్ట ఆర్ధిక వ్యవస్థతో పునర్నిర్మాణం దిశగా పరుగులు పెడుతున్నది. ఒకటీ రెండు కాదు…పలు పన్నుల శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ, పారదర్శక విధానాల ఫలితంగా అంచనాలను మించిన రాబడితో తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ దూరదృష్టికి ఈ ఫలితాలు నిదర్శనంగా, రాష్ట్ర సంపద పెంపులో వాస్తవాలై ప్రతిబింబిస్తున్నాయి. దేశమంతటా కరోనా విపత్తుతో ఆర్ధికంగా కుదేలవుతున్నా.. బడ్జెట్‌లను కుదించుకుంటున్నా.. విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలతో సతమతమవుతున్నా… తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఇందుకు భిన్నంగా ఆర్ధిక వృద్ధితో అలవోకగా దూసుకుపోతున్నది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా పురోగమిస్తున్నది. పన్నుల రాబడిలో ఆశించినదానికంటే అద్భుత వృద్ధిరేటు నమోదవుతున్నది.
ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల వంటి సొంత వనరుల్లో ప్రగతి ఊపుమీద కొపనసాగుతున్నది. వాణిజ్య పన్నుల్లో మార్చి నెలలో 2శాతం వృద్ధితో రూ. 4242కోట్లను ఆర్జించగా, మొత్తం పన్నుల ఆదాయం గురువారంతో ముగిసిన ఆర్ధిక యేడాది(2021-22)లో రూ.1లక్ష 6వేల 900కోట్లకుగానూ ఫిబ్రవరి ముగిసే నాటికి రూ. 98,199 కోట్లుగా చేరింది. దీంతో ఇంకా నెల సమయం ఉండగానే అద్బుత రేట్‌ను నమోదు చేసుకోగా, మార్చి రాబడులతో రికార్డుకు చేరింది. కోవిడ్ సంక్షోభంతో దేశమంతటా రుణాత్మక వృద్ధి దిశగా ప్రయాణించగా, తెలంగాణ ఒక్కటే సానుకూల దిశగా పయనిస్తోంది. దేశంలోనే అద్భుతమైన శాంతిభద్రతలతో స్థిర రాజకీయ సుస్థిరత, సీఎం కేసీఆర్ వంటి ముందు చూపున్న దార్షనికత కల్గిన నేత నాయకత్వంతో తెలంగాణ ఆర్ధిక వృద్ధిరేటులో ముందుకు సాగుతోంది. దేవంలోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపి)లో తెలంగాణ అద్భుత ఘనతను సొంతం చేసుకుంది. 19.10 వృద్ధిరేటుతో రూ. 11,54,860కోట్లకు చేరగా, తలసరిలో 18.78శాతం వృద్ధితో రూ. 2,78,833కు చేరింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. గతేడాది 2.25జీఎస్‌డీపి వృద్ధి 19.10శాతం పెరిగింది. ఆర్ధికవృద్ధిరేటు కూడా ఈ యేడాది ఏకాఎకిన 9.2 శాతంగా నమోదైంది. దీంతోపాటు తలసరి ఆదాయం కూడా అద్భుత పెరుగుదలను కనబర్చింది. ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఇది ఆర్ధిక బలోపేతమేనన్న వాస్తవాలు నిజమవుతున్నాయి. గతేడాది 2,34,751గా ఉన్న తలసరి ఆదాయం ఈ యేడాది 2,78,833కు చేరింది.
2021-22 ఆర్దిక ఏడాదిలో అన్ని రాష్ట్రాలు రాబడుల తగ్గుదలతో తమ బడ్జెట్ అంచనాలను సవరించుకుని కుదించుకుంటున్నాయి. ఇటువంటి సందర్భంలో దేశ చిత్రపటంలో ఏడేళ్ల చిర ప్రాయంలో ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల వంటి సొంత వనరుల రాబడి లక్ష్యాలను మించింది. గడచిన ఆర్ధిక యేడాదిలో తెలంగాణ వార్షిక పన్నుల రాబడి అంచనాలను మించి రూ. 1.10లక్షల కోట్లకుపైగా సమకూరింది. అమ్మకం పన్నులు అంచనా రూ. 17వేల కోట్లుకాగా, మార్చి నెలాఖరు వరకు రూ. 28వేల 800కోట్లకుపైగా ఖజానాకు చేరింది. ఎక్సైజ్ ఆదాయం రూ. 17వేల కోట్ల అంచనాకుగానూ అమ్మకాలు రూ. 31046 కోట్లతోపాటు, లైసెన్సులు, దరఖాస్తుల రుసుముల వంటి వాటితో రూ. 20వేల కోట్లకు చేరుకుంది. ఇక కీలకమైన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రికార్డు స్థాయిలో రూ. 12,350కోట్లతో రాష్ట్ర రాబడికి స్పూర్తిని నింపింది. కేంద్ర పన్నుల వాటా వార్షిక అంనా రూ. 17వేల కోట్లుకాగా, రూ. 15వేల 647కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కేంద్ర నిర్లక్ష్య వైఖరి, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కారణంగా నానాటికీ కేంద్రం అంచనాలకంటే అత్యల్పంగా విడుదల చేస్తూ ఆర్ధిక ప్రగతికి అడ్డుగా నిలుస్తున్నదని ప్రభుత్వం పలు సందర్భాల్లో పేర్కొంది. ఇది ముగిసిన గత ఆర్ధిక ఏడాది కూడా రుజువైంది. ఇతర పన్నుల ఆదాయాలు ఆశించిన మేర ఖజానాకు చేరగా, పన్నేతర రాబడుల్లో ప్రతికూలతం ఎదురైంది. రూ. 30,557కోట్లకుగానూ కేవలం రూ. 6వేల 80కోట్లు మాత్రమే ఆర్జించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్ర ఏర్పాటునాటినంచి రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో స్థిరంగా పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిల్చింది. వృద్దిరేటులో అగ్రగామిగా వెలుగొందుతున్నది. ఇదే ప్రభావాన్ని కొనసాగిస్తూ కరోనా తీవ్రంగా ఉన్న 2019-20, 2020-21లలోనూ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా స్థిరంగా వృద్ధిరేటులో ముందుకు కదిలింది. అనేక రాష్ట్రాలు మైనస్ గ్రోత్‌లోకి వెళ్లినా, తెలంగాణ మాత్రం పాజిటివ్ రేటుతో వృద్దికి చేరువైంది. జీఎస్డీపీ జీఎస్డీపి విలువ ఒకే ఏడాదిలో ఏకంగా రూ. 1,85,204లక్షల కోట్లు పెరిగి దేశంలోనే రెండో స్థానంలో నిల్చింది. జీఎస్డీపి స్థిర ధరల వద్ద కూడా తెలంగాణ ఉత్తమ స్థాయిలో ప్రతిభ చూపి 2020-21తో పోలిస్తే 2021-22లో 11.2శాతం వృద్దిరేటు సాధించింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో రెండో స్థానంలో నిల్చింది.
ఇక డబుల్ ఇంజిన్ గ్రోత్‌గా విస్తృత ప్రచారం చేసుకుంటున్న ఉత్తర్ ప్రదేశ్‌లో తలసరి ఆదాయంలో చిట్ట చివరి స్థానం ఉండగా, గుజరాత్ కూడా తెలంగాణను మించలేదు. 2021-22లో స్థిర ధరల వద్ద తలసరిలో తెలంగాణ నెంబర్ 1గా నిల్చింది. ఇది రూ. 1.62లక్షలుగా ఉంది. తెలంగాణ 2021-22లో అప్పులు రూ. 43,168కోట్లను సేకరించింది. ఇది జీఎస్‌డీపిలో నిర్ధేశిత శాతానికి లోబడే ఉండటం గమనార్హం. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంతో ఆర్ధికరంగంలోనే కాకుండా అన్ని రంగాలు వృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. వార్షిక సగటు వృద్దిరేటులో దక్షిణ భారతంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిల్చింది. ఏపీ 11.2శాతం వృద్ధిరేటులో ఉండగా తెలంగాణ 11.7శాతం నమోదు చేసుకుంది. కర్నాటక 4.4 శాతం, కేరళ 10.8శాతం, తమిళనాడు 10.1 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుకు చేరాయి. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల వాటా 22.83శాతంగా ఉన్నాయి. కాగా పలు రాష్ట్రాలు సుమారుగా 18 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి రుణాలు తెచ్చుకున్నాయి. ఈ వరుసలో తెలంగాణ 25వ స్థానంలో ఉండగా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రలు మాత్రమే తెలంగాణకంటే తక్కువ అప్పులు తెచ్చుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..