హైదరాబాద్, ఆంధ్రప్రభ : సింగరేణికి ఈ ఏడాదిలో లాభాల పంట పండింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,222 కోట్ల నికర ఆధాయంతో ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు 430 శాతం వృద్ధి సాధించిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 81 శాతం వృద్థి సాధించి.. కోల్ ఇండయా, మహారత్న కంపెనీలన్నింటికంటే లాభాల్లో ముందున్నదని, సింగరేణి నెంబర్ వన్‌గా నిలిచిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 33,065 కోట్ల టర్నోవర్‌తో రూ. 2,222 కోట్ల నికర ఆదాయం లభించిందని వివరించారు. 2021-22లో నికర లాభాలు రూ. 1,227 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది సాధించిన లాభాలు 81 శాతం అధికమని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ 430 వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉండగా, 241 శాతంతో రెండో స్థానంలో పవర్‌గ్రిడ్ కార్పోరేషన్, 114 శాతం వృద్ధితో మూడో స్థానంలో పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, 86 శాతం వృద్ధితో కోల్ ఇండియా నాలుగో స్థానంలో ఉన్నాయని ఆయన వివరించారు. సింగరేణి సంస్థ తన 143 ఏళ్ల చరిత్రలో.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనే అత్యధిక ప్రగతి సాధించిందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, బొగ్గు రవాణాలో 39 శాతం, అమ్మకాలల్లో 177 శాతం, లాభాల్లో 430 శాతం వృద్ధి సాధించామని శ్రీధర్ చెప్పారు. సింగరేణి అధికారుల, కార్మికులు, సిబ్బంది అంకిత భావంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని, సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది కూడా నిర్ధేశించిన లక్ష్యాలను సాధిస్తే రూ. 4 వేల కోట్ల వరకు లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు.